ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
2026 నాటికి 50 కొత్త అసెంబ్లీ స్థానాలు.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని స్పష్టమవుతోంది. ఈ ప్రక్రియ అమలైతే ఏపీలో అదనంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కి పెరగనున్నాయి.
వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన జరిగిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అయితే జనగణన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా జనగణనతో పాటు మహిళా బిల్లు ఆమోదం దిశగా అడుగులు పడుతుండటంతో 2026లో పునర్విభజన అనివార్యమనే సంకేతాలు వస్తున్నాయి.
విభజన చట్టం ప్రకారం…
2014లో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. తెలంగాణకు 117 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు మిగిలాయి. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినందున పాలనా వికేంద్రీకరణ కోసం నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అప్పటి విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అయినప్పటికీ పదేళ్లు గడిచినా పునర్విభజన ప్రక్రియ ముందుకు సాగలేదు.
ప్రతి పార్లమెంట్‌కు రెండు అసెంబ్లీ సీట్లు?
ప్రస్తుతం ఏపీలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లు అదనంగా పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన మొత్తం 50 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి.
2026 రెండో అర్ధభాగంలో ప్రక్రియ ప్రారంభం
2025లో జనగణన పూర్తిచేసి, అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత 2026 ద్వితీయార్థంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి కొత్త నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ఆశావహుల్లో ఆశలు
ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాజకీయంగా చురుకుగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త అవకాశాలపై ఆశలు పెరిగాయి. పునర్విభజనతో 50 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడితే, అన్ని పార్టీల్లోని ఆశావహులకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశాలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
APAssembly
















