బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచే దీపికా బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న దీపిక ఇప్పుడు ఓ గొప్ప ఘనతను అందుకున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె అరుదైన గౌరవం పొందారు.
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్2026కు దీపికా పదుకొణె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ను ఇచ్చింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికా ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. అయితే ఈ గౌరవమందుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ దీపికా పదుకొణెనే కావడం విశేషం. ఈ లిస్ట్ లో డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్ఆడమ్స్, స్టాన్లీ టక్కీ లాంటి హాలీవుడ్ యాక్టర్లతో పాటూ దీపికా పేరు కూడా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ చాలా గర్వపడుతున్నారు.
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయగా, అందులో దీపికా పదుకొణె కూడా ఒకరు. వినోద రంగంలో చేసిన అపారమైన కృషికి గానూ వీరిని ఎంపిక చేసినట్టు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. అయితే దీపికా కేవలం యాక్టింగ్ తోనే కాకుండా తన స్పీచులతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారనే సంగతి తెలిసిందే. 2018లో టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాలో కూడా దీపికా చోటు దక్కించుకున్నారు. 2022లో ఫిఫా వరల్డ్ కప్‌ను ఆవిష్కరించి ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించారు. 2023లో జరిగిన అకాడమీ అవార్డుల వేదికలో దీపిక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ను ఆడియన్స్ కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక దీపికా కెరీర్ విషయానికొస్తే 2006 లో ఇండస్ట్రీలోకి వచ్చిన దీపికా పదుకొణె 2017లో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తున్నారు. దీంతో పాటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రానున్న కల్కి2 సినిమాలో దీపికా ఓ కీలక పాత్ర పోషించనున్నారు.