అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. ఈయన ఎన్టీఆర్ ను బూతు మాటలు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎమ్మెల్యే తీరుపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బూతు మాటలు మాట్లాడటమే కాకుండా వార్ 2 సినిమాని అడ్డుకుంటామంటూ హెచ్చరించారు దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ ఆయన కార్యాలయం పై దాడి చేస్తూ ధర్నాకు దిగారు.
అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్..ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు.. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై ఎమ్మెల్యే దగ్గుపాటి స్పందించారు.
తాను ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. ఇదే విషయం గురించి తాను ఎస్పీకి ఫిర్యాదులు కూడా చేశానని గత 16 నెలలుగా తాను అంటే గిట్టని కొంతమంది నేతలు తనపై ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. తనకు నందమూరి కుటుంబం అంటే మొదటి నుంచి కూడా ఎంతో అభిమానం అలాంటిది నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి గురించి తాను ఎందుకు అలా మాట్లాడతాను అంటూ ఈయన ప్రశ్నించారు. తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడ అలా మాట్లాడలేదని ఇదంతా కూడా కుట్రలో ఒక భాగమే అని క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.