కడప జిల్లా గండికోట యాత్రా స్థలంలో జరిగిన బాలిక హత్యపై విచారణ కొనసాగుతోంది. ఈ రాత్రికల్లా కేసు ఛేదిస్తామని పోలీసులు ప్రకటించారు. కడప ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. డీఐజీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.గండికోట దగ్గర మీడియాతో మాట్లాడిన డీఐజీ ప్రవీణ్, ఈ హత్య బాలిక ప్రియుడు లోకేశ్ చేయలేదని ప్రకటించారు. లైంగిక దాడి జరగలేదని కూడా చెప్పారు. అయితే బాలిక పై వస్త్రాలు మాత్రం తొలగించి ఉన్నాయన్నారు. ఎవరు హత్య చేశారనేది త్వరలోనే తేలుస్తాం అని ఆయన చెప్పారు.తమకు కొన్ని కీలక సాక్ష్యాలు దొరికాయనీ, పూర్తి వివరాలతో ప్రకటన చేస్తామన్నారు.కడప జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే జిల్లాలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
తన ఊరికేచెందిన లోకేశ్ అనే అబ్బాయితో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉంది. దీనిపై రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.తాజాగా జూలై 14 సోమవారం ఉదయం కాలేజీకని ఇంట్లోంచి బయల్దేరిన ఆ బాలిక, కాలేజీకి కాకుండా ప్రియుడు లోకేశ్ తో కలసి గండికోట వైపు వెళ్లింది.ఉదయం 8.30 ప్రాంతంలో ఆమెను బైక్ పై గండికోటకు తీసుకువచ్చిన లోకేశ్, తిరిగి 10.30 ప్రాంతంలో ఒంటరిగా వెనక్కు వెళ్లాడు.బాలిక కాలేజీకి వెళ్లని సంగతి ఆ రోజు ఉదయమే ఆమె ఇంట్లో తెలిసిపోయింది. సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళవారం గండికోట దగ్గర ఆ బాలిక మృతదేహం కనిపించింది. శరీరంపై భాగంలో బట్టలు లేవు. గాయాలు ఉన్నాయి. దీంతో అది అత్యాచారం, హత్య అని అనుమానించారు. పోస్టుమార్టం చేశారు.విచారణ జరిపిన తరువాత, అత్యాచారం జరగలేదనీ, కాలేయానికి (లివర్) బలమైన గాయం అవడం వల్ల బాలిక చనిపోయిందనీ పోలీసులు అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులు మీడియాకు చెప్పారు.మరోవైపు ఆ బాలిక, లోకేశ్ బైక్‌పై వెళ్లడం, తిరిగి వెనక్కు లోకేశ్ ఒక్కడే బైక్‌పై వెనక్కు రావడం – ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.దీంతో మొదట్లో చాలా మంది లోకేశే బాలికని చంపి ఉంటాడని అనుమానించారు. కానీ అతను హత్య చేయలేదని పోలీసులు ఒక నిర్థరణకు వచ్చారు.
బాలిక కాలేజీకి వెళ్లకుండా గండికోటకు వెళ్లిన విషయం స్నేహితురాళ్ల ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిందనీ, దీంతో వారు అక్కడకు వస్తారన్న భయంతో లోకేశ్ బైక్‌పై వెళ్లి, ఆమెను బస్సులో రమ్మని చెప్పాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.దీంతో అక్కడ ఎవరైనా వేరే వారు ఒంటరి బాలికపై దాడి చేసి హత్య చేశారా లేక, ఆమెకు తెలిసిన వారు అంటే, ఈ ప్రేమ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు.ఆ క్రమంలో ఆమె సోదరుడు సురేందర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆరోజు ఉదయం 10.30కే లోకేశ్ అక్కడ నుంచి వెళ్లిపోగా, మధ్యాహ్నం తరువాత ఆమె హత్య జరిగి ఉండొచ్చని పోలీసుల అంచనా.
బాలిక కుటుంబం ఈ హత్యపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. సురేందర్‌ను అనుమానించడాన్ని వారు తప్పు పడుతున్నారు. సోదరుడు, సోదరిని బట్టల్లేకుండా చేసి హత్య చేస్తాడా అని ప్రశ్నిస్తున్నారు. ప్రియుడు లోకేశే హత్య చేశాడన్నది వారి అభియోగం.పోలీసులు ఈ కేసును సవాల్‌గా స్వీకరించి విచారణ చేస్తున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ అక్కడే ఉన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, మొబైల్ టవర్ లొకేషన్, ఇతరత్రా అన్ని రకాలుగా విచారణ జరుగుతోంది.తమకు కీలక సాక్ష్యం దొరికిందనీ,ఈ కేసు ఛేదిస్తామనీ డీఐజీ ప్రకటించారు.బాలిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో పూర్తయ్యాయి.