లాస్ ఏంజెలెస్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ఒక చారిత్రక పరిణామం. కానీ ఈ వార్త భారత్-పాకిస్థాన్ అభిమానులకు మిశ్రమ అనుభూతిని ఇస్తోంది. 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ భాగం కాబోతున్నప్పటికీ క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూసే దాయాదుల పోరు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈ మెగా ఈవెంట్‌లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
చరిత్రలో కేవలం ఒకే ఒక్కసారి 1900లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను నిర్వహించారు. ఆ పోటీలో బ్రిటన్ జట్టు ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సరిగ్గా 128 సంవత్సరాల తర్వాత 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ మళ్లీ భాగం కావడం క్రీడా ప్రపంచంలో ఒక పెద్ద వార్త. ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.
అభిమానులకు నిరాశ కలిగించే ముఖ్య కారణం ఐసీసీ రూపొందించిన నూతన అర్హతా నిబంధనలు. ఒలింపిక్స్‌లో క్రికెట్ టోర్నమెంట్‌ను పరిమిత జట్లతో పురుషులు, మహిళల విభాగాల్లో తలా 6 జట్లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రతి ఖండం ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా నుంచి కేవలం ఒక్క జట్టుకే అవకాశం లభిస్తుంది. ఈ ఎంపిక ఆయా ఖండాల్లోని జట్ల ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా జరుగుతుంది. ఆతిథ్య దేశంగా లాస్ ఏంజెలెస్ 2028 క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నందున అమెరికా ఈ క్రీడల్లో తప్పనిసరిగా ఓ జట్టుగా ఆడుతుంది.. ర్యాంకింగుల ఆధారంగా ప్రతి ఖండం నుంచి 1 చొప్పున నాలుగు జట్లు వస్తాయి. క్వాలిఫయర్ రౌండ్ ద్వారా 1 జట్టు ను ఎంపిక చేస్తారు.
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా చూస్తే ఆసియా ఖండం నుంచి భారత్ అత్యుత్తమ ర్యాంకింగ్‌లో ఉంది. ఐసీసీ వర్గాలు అంచనా వేస్తున్న ప్రాంతీయ అర్హత జట్లు చూస్తే ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లాండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, ఆతిథ్య దేశంగా అమెరికా ఆడనున్నాయి. ఈ లెక్కన ఆసియా నుంచి ఒక్క భారత్‌కు మాత్రమే నేరుగా చోటు దక్కుతుంది. దీంతో పాకిస్థాన్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దాదాపుగా లేనట్టే కనిపిస్తోంది. పాకిస్థాన్ అర్హత సాధించాలంటే.. ఒకే ఒక్క స్థానం ఉన్న క్వాలిఫయర్ రౌండ్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది, అది కూడా అత్యంత కష్టంతో కూడుకున్న విషయంగా చెప్పొచ్చు. ప్రపంచంలోని అన్ని జట్లకు ఈ క్వాలిఫైయర్స్ లో పోటీపడుతాయి.
అందుకే, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూసే భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ 2028 ఒలింపిక్స్ వేదికగా కనిపించకపోవచ్చనే వార్త నిస్సందేహంగా నిరాశపరిచే అంశం. దీనిపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఏమైనా ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ పునరాగమనం, ఈ క్రీడను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడానికి ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది.
ఈ కఠినమైన నిబంధనల కారణంగానే భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ను 2028 ఒలింపిక్స్ వేదికగా చూసే అవకాశం అభిమానులకు లేనట్లే అని స్పష్టమవుతోంది. క్రికెట్‌కు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించినప్పటికీ దాయాదుల పోరును మిస్ అవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఐసీసీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.


















