క్రెడిట్ రిపోర్టులో SMA (Special Mention Account) పడిందంటే సామాన్యుడికి నిజంగానే కష్టకాలం మొదలైనట్టే. లోన్ EMI గానీ, క్రెడిట్ కార్డ్ బిల్లు గానీ ఒక్కసారి సకాలంలో కట్టకపోతే బ్యాంకులు వెంటనే అలర్ట్ అవుతాయి. బకాయి 1 నుంచి 30 రోజులు ఆలస్యమైతే SMA-0, 31 నుంచి 60 రోజులు అయితే SMA-1, 61 నుంచి 90 రోజులు దాటితే SMA-2గా గుర్తిస్తారు. ఇదంతా ఒక వార్నింగ్ బెల్ లాంటిది – “మీరు దివాలా వైపు వెళ్తున్నారు” అని బ్యాంకులు ముందుగానే చెప్పే సంకేతం.
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే…
ఈ SMA ఒక్కసారి క్రెడిట్ రిపోర్టులో నమోదైతే, మీ క్రెడిట్ స్కోర్ భారీగా పడిపోతుంది. తర్వాత కొత్త లోన్ కావాలంటే బ్యాంకులు వెనకడుగు వేస్తాయి. హోమ్ లోన్, వాహన లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ – ఏదైనా సరే… “మీ రిపోర్టులో SMA ఉంది” అంటూ తలుపులు మూసేస్తారు. ఒక సామాన్య ఉద్యోగి, చిన్న వ్యాపారి, రైతు లేదా మధ్యతరగతి కుటుంబానికి ఇది నిజంగా శిక్షలాంటిదే.
కానీ ఇక్కడే పెద్ద ప్రశ్న…
ఇలాంటి కఠిన నిబంధనలు సామాన్యులకేనా?
లేక బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి కట్టకుండా ఎగొట్టి, విదేశాలకు పారిపోయిన బడా బడా వ్యాపారస్తులకు, రాజకీయ నేతలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయా?
చిన్న మొత్తంలో EMI ఆలస్యమైతే సామాన్యుడి మీద ఫోన్ కాల్స్, నోటీసులు, రికవరీ ఏజెంట్లు…
కానీ వేల కోట్ల బకాయిలు ఉన్న పెద్దవాళ్ల విషయంలో మాత్రం రిస్ట్రక్చరింగ్, హెయిర్‌కట్, వన్ టైమ్ సెటిల్‌మెంట్ లాంటి మార్గాలు ఎందుకు కనిపిస్తాయి?
వాళ్ల క్రెడిట్ రిపోర్టుల్లో కూడా SMA, NPA ముద్రలు అదే కఠినతతో పడతాయా? లేక వ్యవస్థే వాళ్లకు సాఫ్ట్‌గా ఉంటుందా?
ఈ విషయంలో పారదర్శకత చాలా అవసరం.
బ్యాంకింగ్ వ్యవస్థలో చట్టం అందరికీ సమానంగా ఉండాలి. సామాన్యుడికి ఒక నిబంధన, బడా బాబులకు మరో నిబంధన అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
కాబట్టి క్రెడిట్ రిపోర్ట్, SMA, NPA వంటి అంశాల్లో
– ఎవరికీ మినహాయింపులు ఉన్నాయి?
– ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
– పెద్ద లోన్ డిఫాల్టర్ల వివరాలు ఎందుకు పూర్తిగా బహిర్గతం కావడం లేదు?
ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లేకపోతే “చట్టం సామాన్యుడికే, శక్తివంతులకాదు” అనే అనుమానం ప్రజల్లో మరింత బలపడుతుంది.






