ఇటీవల కాలంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు షాకింగ్ గా అనిపించే ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఇటీవల మధ్యప్రదేశ్ లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లోని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సంపద చూసి అధికారులే షాక్ తిన్నారనే కామెంట్లు వినిపించాయి. అతని లగ్జరీ లైఫ్ వైరల్ గా మారింది. కార్లు, ఫామ్ హౌస్ లెక్కైతే చెప్పే పనేలేదు.
ఇందులో భాగంగా… రూ.3 కోట్లకు పైగా విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండితో పాటు రూ.26 లక్షల నగదు, లగ్జరీ ప్లాటు, 39 అధునాతన కాటేజీలతో ఫామ్ హౌస్, అక్కడ 17 టన్నుల తేనె దొరికిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో.. తాజాగా మధ్యప్రదేశ్ లోనే మరో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూసి అధికారులు ఖంగుతిన్నారట. ఇతని కుటుంబం సినిమాల్లో పెట్టుబడులు కూడా పెడుతుందని అంటున్నారు.
అవును… మధ్యప్రదేశ్ లోని లోకాయుక్త పోలీసులు రెండు నగరాల్లోని రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి నివాసాలపై దాడులు చేసి కోట్ల విలువైన స్థిర, చరాస్థులతో పాటు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ చూసిన బంగారం, వెండితో పాటు నోట్ల కట్టలు ఒకెత్తు అయితే… అతని కుటుంబం సినిమాల్లో పెట్టుబడులు సైతం పెట్టిందనే విషయం మరింత సంచలనంగా మారిందని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ధర్మేంద్రసింగ్ భదౌరియా ఎక్సైజ్ అధికారిగా పనిచేసి, రిటైర్ అయ్యాడు. అయితే… అతని వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఇటీవల మధ్యప్రదేశ్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో.. అతని నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా… గ్వాలియర్, ఇండౌర్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన లోకాయుక్త డీఎస్పీ సునీల్ తలాన్… ధర్మేంద్ర సింగ్ నివాసాల్లో రూ.18.59 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఇదే సమయంలో… పూర్వీకుల ఇల్లుతో పాటు నాలుగు ఫ్లాట్స్, 4,700 చదరపు అడగుల స్థలంలో మూడు అంతస్తుల ఇల్లు ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. వీటితోపాటు 4.22 కిలోల బంగారం, 7.13 కిలోల వెండి, రూ.1.13 కోట్లు, 5వేల యూరోల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీటితో పాటు దాడుల సమయంలో ఖరీదైన వాహనాలు, ఫర్నీచర్, చేతి గడియారాలు, పర్ ఫ్యూమ్ లు, చీరలు సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ధర్మేంద్రసింగ్ కుటుంబం సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందిందని డీఎస్పీ సునీల్ తలాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. ఆయన 38 ఏళ్ల సర్వీసులో రూ.2 కోట్ల జీతం, భత్యం రూపంలో అందుకోవడానికి వీలు ఉందని వివరించారు.
ఇలా వరుసగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరోవైపు ధర్మేంద్రసింగ్ పై అవినీతి నిరోధక (సవరణ) చట్టం, 2018 కింద కేసు నమోదు చేసిన పోలీసులు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు!