రాష్ట్ర కాంగ్రెస్‌లో మరోసారి షర్మిల విషయం చర్చకు వచ్చింది. ఇటీవల రాష్ట్రంలో డిసిసిల ను ఏర్పాటు చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో చాలామంది నాయకులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పార్టీలో పదవులు దక్కితే ఎవరికి మాత్రం ఆనందం ఉండదు. పైగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నాయకులు.. ఎప్పటినుంచో పార్టీలో పని చేస్తున్న నాయకులు కూడా తమకు గుర్తింపు లేదని, తమకు ఇబ్బందులు వస్తున్నాయని పదేపదే చెబుతున్నారు.
ఈ క్రమంలో పార్టీ అధిష్టానం స్పందించి నాయకులకు పదవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి అనకాపల్లి వరకు కూడా చాలా మంది నాయకులు తమకు పదవులు వస్తాయని జిల్లాల్లో పార్టీ తరఫున చక్రం తిప్పచ్చని భావించారు. కానీ చిత్రంగా ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయింది. పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం డీసీసీల నియామకాలను ఇప్పట్లో చేపట్టాల్సిన అవసరం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్టు తెలిసింది.
పార్టీ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని, ఇప్పటికి ఇప్పుడు డీసీసీలను ప్రకటించడం ద్వారా అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆమె పేర్కొన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. దీనికి తోడు చాలామంది నాయకులను క్రమశిక్షణ సంఘం ముందు పెట్టాలన్న ప్రతిపాదన కూడా షర్మిల చేసినట్టు సమాచారం. కొందరు నాయకులు తన మాట వినడం లేదని, సొంత అజెండాలు రూపొందించుకొని వ్యవహరిస్తున్నారని షర్మిల చెబుతున్న మాట. అయితే వాస్తవం ఎంత అనేది తెలియకపోయినా నిజానికి షర్మిలే సొంత అజెండా అమలు చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇంత సీరియస్ విషయంలో షర్మిల రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి నాయకులపై ఆరోపణలు గుర్తించడం వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం ఇప్పుడు మరోసారి ఆమెను వివాదంలోకి లాగింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక పార్టీలో ఉండలేమని కొందరు నాయకులు అంతర్గత సంభాషణలో స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు మరింత మంది షర్మిలకు వ్యతిరేకంగా గళం వినిపించడం గమనార్హం.