తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవచ్చని సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ మార్పు దిశగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ బలోపేతం, సమతుల్యత, వర్గాల సమన్వయం అనే మూడు లక్ష్యాల దిశగా ఈ మార్పులు ఉండనున్నాయని సమాచారం.
ప్రస్తుతం భట్టి విక్రమార్క మాత్రమే డిప్యూటీ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి కేబినెట్‌లో బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరో డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలనే ఆలోచన హైకమాండ్‌లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరును ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక ఎన్నికల వ్యూహాల దృష్ట్యా ఈ నిర్ణయం కీలకంగా భావిస్తున్నారు.
మహేష్ గౌడ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించే ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే, ఆయన స్థానంలో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త బీసీ నేతను ఎంపిక చేసే అవకాశం ఉంది. అందులో పొన్నం ప్రభాకర్ పేరు ప్రాధాన్యంగా చర్చలో ఉంది.
ఇక మంత్రివర్గంలో మార్పుల దిశగా కూడా చురుకైన కసరత్తు జరుగుతోంది. పనితీరు తక్కువగా ఉన్న కొందరు మంత్రులకు పదవి కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హైకమాండ్ వారికి ప్రగతి నివేదికలు ఇచ్చి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
అదేవిధంగా, కొత్తగా మంత్రివర్గంలో చోటు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా బీసీ కోటాలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య లాంటి నేతలు సద్వకాశం కోసం ప్రయత్నాలు చేస్తుండగా, అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇచ్చిన తర్వాత ఇతర సీనియర్ నేతలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను కోరుతున్నారు.
అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ గౌడ్ కూడా కేబినెట్‌లో అవకాశం కోరుతున్నారు. ఎస్టీ వర్గం నుంచి బాలూ నాయక్, రామచంద్రునాయక్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేబినెట్ ప్రక్షాళనపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు అన్ని నేతలు హైకమాండ్ కదలికలపై కన్నేయగా, రాబోయే రోజుల్లో రేవంత్ టీంలో జరిగే మార్పులు తెలంగాణ రాజకీయాలకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
















