సమాజ హితం లేని, రాజ్యాంగపరంగా లేని చట్టవిరుద్ధమైన చర్యలు ఎప్పుడూ ఆమోదయోగ్యం కావు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అక్రమాలకు పాల్పడితే టీడీపీ వారైనా కేసులు పెట్టి జైళ్లకు పంపించాం అని చెప్పుకొచ్చారు. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ అని ప్రకటించాం. కొందరు సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయం అద్భుతంగా నిర్మించారు. పరిసరాలు అందర్నీ ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉన్నాయి అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి. కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలి. అప్పుడే పోలీసులు అందించే సేవల పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో సెక్యూరిటీ, సేఫ్టీ భావన ప్రజల్లో, భక్తుల్లో రావాలి. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న తిరుపతి పోలీసులకు అభినందనలు తెలియచేస్తున్నాను. పీడీ యాక్టు పెట్టి సస్పెక్ట్ షీట్లు తెరిచి నిఘా పెట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమర్ధంగా అరికడుతున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.
‘2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు. మేం ఎప్పుడు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోలేదు. హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘గత పాలకులు ఇష్టాను సారంగా చేసిన వ్యవహారాలతో ప్రజల్లోనూ రాష్ట్రంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. కొందరు ఇప్పటికీ అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాల పేరుతో రౌడీయిజం చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం’అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
రోడ్లు బ్లాక్ చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదు. పోస్టర్ల వద్ద కత్తులతో జంతు బలి చేసి ఫ్లెక్సీలపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తారా.? వైఎస్ వివేకా హత్యకేసులో నేరం చేసిన వ్యక్తులు దానిని ఇతరుల పైకి వేసేందుకు ప్రయత్నించారు.’అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘నేరస్తులు ఎన్ని డ్రామాలు ఆడినా ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలి. బంగారు పాళ్యంలో మామిడి కాయలు తొక్కించారు. గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించేసి పొదల్లో పారేసి పోయారు. అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం’అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాలలో ఇంకా అసభ్య పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎన్డీఏ భాగస్యామ్యంలో ఉన్న వారెవరూ ఈ తరహాలో వ్యవహరించటం లేదు. రాజకీయ ముసుగులో ఉండి నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం’అని సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘పోలీసు వ్యవస్థ గట్టిగా ఉండాలి. నేరం జరిగిన తర్వాత వ్యవహరించే తీరు చాలా ముఖ్యం. దేవాలయాల్లో దాడులు, దొంగతనాలు ఇప్పుడు లేవు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా చిన్న ఘటన కూడా జరగడానికి వీల్లేదు. టెక్నాలజీని సమర్ధంగా వాడుకుని నేర నియంత్రణ చేయాలి. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేస్తే విజువల్స్ ఆధారాలుగా మారతాయి. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ ఉండాలని పిలుపునిస్తున్నాను. కొందరు బజారులోకి వచ్చి నోరు పారేసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.’అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ‘రౌడీయిజం చేసి పెద్ద నాయకుడు అయిపోతారని భావిస్తే ఎలా. వారు తమ ఇంట్లో పెద్ద నాయకుడు కావచ్చేమో బయటకాదు. కలియుగ వైకుంఠమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు వ్యవహరించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో జరుగుతున్న ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా మూడు రోజుల పాటు జరుగుతోంది. ఇందులో RSS సార్స్‌ఛీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు.







