రాజధాని అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు విజన్ చాలామందికి అర్థమైనట్టుగా కనిపించడం లేదు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మరీ ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాజధానిగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే రాజధాని విస్తరణ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఇది ప్రస్తుతం వివాదంగా మారింది. కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా రాజధానికి అంత భూమి అవసరమా అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేస్తుండడం విశేషం.
మరీ ముఖ్యంగా వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజధానికి అంత భూమి ఎందుకంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల క్రమంలో అసలు చంద్రబాబు విజన్‌ను అర్థం చేసుకోవడంలో ఎక్కడో తేడా కొడుతొంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి గత 2015లో జరిగిన భూ సమీకరణ సమయంలో రాజధాని ప్రాంతానికి 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కూడా అప్పట్లో చెప్పారు.
దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మరో 20 వేల ఎకరాలకు పైగా భూములు రాజధానిలో అందుబా టులో ఉన్నాయి. అయితే, గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత రాజధాని విషయంపై మరో వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు, రాబోయే పరిశ్రమలు అదేవిధంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న 33 వేల ఎకరాలు సరిపోవు అన్నది చంద్రబాబు ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు ఇప్పటికే రైతులనుంచి సేకరించిన భూములు వాటికి ఇవ్వవలసినటువంటి కమర్షియల్ ప్లాట్లు అదేవిధంగా నివాసయోగ్యమైన ప్లాట్లను కేటాయించేందుకు మరిన్ని భూములు అవసరం అని భావిస్తున్నారు.
ఇక రాజధాని నగరంలో ఒలింపిక్ స్థాయి క్రీడలు నిర్వహించేలాగా అంతర్జాతీయ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని దీంతోపాటు స్పోర్ట్స్ సిటీతో రాజధానికి కొత్త హంగులు అద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక రాజధాని అంటే ఎప్పటికప్పుడు జనాభా పెరుగుతుంది. వనరులు పెంచాల్సిన అవసరం కూడా వస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ను తీసుకుంటే గత 20 ఏళ్ల కంటే ఇప్పుడు జనాభా రెండు రెట్లు పెరిగింది.
అదేవిధంగా వచ్చే 20 30 సంవత్సరాల్లో అమరావతి రాజధాని లో కూడా జనాభా పెరిగినప్పుడు భూమి అవసరాలకు తగిన విధంగా ల్యాండ్ బ్యాంకు ను సృష్టించాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. అందుకే ఇప్పటికే తీసుకున్న భూమితో పాటు మరింత భూమిని సేకరించాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన రెండో విడత భూ సమీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతిపక్ష పార్టీల విఫలమయ్యాయో.. లేకపోతే కావాలని రాజకీయం చేస్తున్నాయా అనేది చూడాలి.
















