ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA), లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఉత్పత్తిని కర్ణాటక నుంచి ఏపీకీ తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. బెంగళూరు విమానాశ్రయానికి ఒక గంట దూరంలో ఉన్న లేపాక్షి-మడకసిర హబ్‌లో AMCA ఉత్పత్తి సౌకర్యం కోసం 10,000 ఎకరాల భూమి కూడా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి సూచించారు.
AMCA అనేది భారతదేశ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, దీనిని HAL ఇతర ప్రైవేట్ సంస్థలతో కలిసి అభివృద్ధి చేస్తోంది, తయారు చేస్తోంది. రక్షణ పారిశ్రామిక కారిడార్ కోసం చంద్రబాబు పెద్ద స్థాయి ప్రతిపాదనలో భాగం. ఇది ఉత్తరం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు 23,000 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు తర్వాత భారతదేశంలో మూడో రక్షణ కారిడార్ అవుతుంది. ఈ కారిడార్‌లో ఐదు హబ్‌లను చంద్రబాబు ప్రతిపాదించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో శుక్రవారం దీనిపై చర్చించారు.
లేపాక్షి-మడకసిర హబ్: AMCA ఉత్పత్తిని ఈ హబ్‌కు తరలించాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఇది రక్షణ పారిశ్రామిక కారిడార్‌లో అతిపెద్ద హబ్‌గా ప్లాన్ చేసి ఉంది. బెంగళూరు ఇకోసిస్టమ్ కంటే ఆంధ్రప్రదేశ్ భూమి, మెరుగైన పాలసీ ఆధారిత ప్రోత్సాహకాలను అందించగలదని వాదించారు.జగ్గియాపేట-డొనకొండ హబ్‌లో భాగంగా, 6,000 ఎకరాల భూమిని గుర్తించారు. ఇక్కడ ఆపరేషనల్ ఎయిర్ బేస్, లాజిస్టిక్స్ సెంటర్, శిక్షణ సౌకర్యం, మరియు ఆర్&డీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
3,000 ఎకరాలలో నావల్ ఎక్విప్‌మెంట్, వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ కోసం ప్రతిపాదించారు. సముద్రతీర భూమిని మెరైన్, అండర్‌వాటర్ SEZగా నోటిఫై చేయాలని, తూర్పు నావల్ కమాండ్, నేషనల్ అడ్వాన్స్‌డ్ ఆఫ్‌షోర్ బేస్‌కు మద్దతు ఇవ్వాలని నాయుడు సూచించారు. HAL 2026-27 నాటికి రూ. 2.5 ట్రిలియన్ ఆర్డర్‌లను ఆశిస్తోందని, LCA, లైట్ కంబాట్ హెలికాప్టర్ల ఉత్పత్తిని విస్తరిస్తోందని, ఈ విస్తరణను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉందని హైలైట్ చేశారు.4,000 ఎకరాలలో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ రక్షణ భాగాల తయారీ కోసం ప్రతిపాదించారు.రక్షణ ఆవిష్కరణలలో పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఈ హబ్‌ను సూచించారు.
రక్షణ పారిశ్రామిక కారిడార్‌లు ఇప్పటికే ఉన్న రక్షణ తయారీ ఇకోసిస్టమ్‌ను ఉపయోగించుకుంటాయి. ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా దానిని మరింత బలోపేతం చేస్తాయి. ఈ కారిడార్‌లు డిఫెన్స్, ఏరోస్పేస్ సంబంధిత వస్తువుల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఇతర దేశాలకు ఎగుమతులను ప్రోత్సహిస్తాయి.రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కలిశారు. ఈ సమావేశాలలో, ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతును కోరారు.