టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం చిరూ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అయితే ప్రతీ ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తన తర్వాతి మరియు రాబోయే సినిమాల గురించి కొత్త అప్డేట్స్ ను అనౌన్స్ చేసే సాంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది.
చిరంజీవి బర్త్ డే ను పురస్కరించుకుని ఆ రోజున ఆయన ఫ్యాన్స్ కు, మూవీ లవర్స్ కు మరింత గుర్తిండిపోయేలా మేకర్స్ ఏదొక సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ ఏడాది చిరంజీవి బర్త్ డే కు ఆయన నటిస్తున్న రెండు సినిమాల నుంచి భారీ అప్డేట్స్ రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరూ విశ్వంభరతో పాటూ మెగా157 లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ రెండింటిలో వశిష్ట దర్శకత్వంలో వస్తోన్న విశ్వంభర సినిమా చాలా కాలంగా ప్రొడక్షన్ లోనే ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ వీఎఫ్ఎక్స్ వల్ల సినిమా లేటైంది. వీఎఫ్ఎక్స్ విషయంలో తాము కోరుకున్న అవుట్‌పుట్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న విశ్వంభర మేకర్స్ ఈ సినిమా నుంచి ఆడియన్స్ ను థ్రిల్ చేసేలా ఓ అప్డేట్‌ను ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.
దీంతో పాటూ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి జట్టు కడుతూ చేస్తున్న మెగా157 నుంచి కూడా ఓ సాలిడ్ అప్డేట్ రానుందంటున్నారు. అంతర్గత సమాచారం ప్రకారం, మెగా157 నుంచి చిరంజీవి బర్త్ డే కు వచ్చే అప్డేట్ టైటిల్ కు సంబంధించిందే అని తెలుస్తోంది. కాకపోతే ఇంకా ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ రెండు అప్డేట్స్ తో ఈ ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు మరింత గ్రాండ్ గా మారబోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.