ఈ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ రోజు ఏర్పడే చంద్రగ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 30 నిమిషాలు. రాత్రి 11.42 గంటలకు గ్రహణ మధ్యస్థ కాలంగా చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణ ప్రభావం ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో కనిపిస్తుంది. మన దేశం మీదా దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడనుంది.
ఈ రోజు రాత్రి చోటు చేసుకునే చంద్రగ్రహణం రాత్రి 9.56 గంటలకు మొదలై అర్థరాత్రి 1.26 గంటల వరకు సాగుతుంది. ఈ గ్రహణ ప్రభావం ఏయే రాశుల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది ప్రశ్న. కొందరికి గ్రహణ కారణంగా ప్రత్యేక శాంతులు.. పూజలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మరికొందరికి తిరుగులేని బలాన్ని తీసుకొస్తుందన్న నమ్మకం ఎక్కువ. ఏదైనా గ్రహణ ప్రభావం ఆర్నెల్ల పాటు ఆయా రాశుల వారి మీద ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.
తాజా చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుందని.. అలాంటి వారు నాలుగు రాశుల వారని చెబుతున్నారు. వీరు మినహా మిగిలిన వారు పూజలు.. శాంతులు చేయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం మొత్తం నమ్మకం మీదే ఉంటుంది. ఇప్పుడు మేం చెబుతున్న విషయాలు పంచాంగకర్తలు.. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్న విషయాలే తప్పించి.. వాటిని నమ్మాలని.. మేం చెప్పేవి కచ్ఛితంగా జరుగుతుందన్న హామీని ఇవ్వట్లేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ ప్రస్తావించే అంశాలు కేవలం అవగాహన.. భారీ ఎత్తున జరుగుతున్న చర్చకు సంబంధించిన వివరాలు అందించటం మాత్రమే అన్న విషయాన్ని పక్కాగా గుర్తు పెట్టుకోండి.
గ్రహణం ఏదైనా కొందరికి అనుకూల.. మరికొందరికి ప్రతికూల ఫలితాల్ని ఇస్తుందని చెబుతారు. జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 1, 4, 8, 12 స్థానాల్లో రాశులు ఉన్న వారికి ఇబ్బందికర ఫలితాలు ఎదురవుతాయని చెబుతారు. ప్రస్తుతం ఏర్పడే చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది.తాజా చంద్రగ్రహణం కారణంగా భారీగా లాభపడే నాలుగు రాశుల వారు ఎవరు? ఎందుకు లాభపడతారు? ఎలాంటి ప్రయోజనాలు పొందే వీలుంది? లాంటి అంశాల్లోకి వెళితే..
ధనస్సు రాశి
చంద్రగ్రహణం కారణంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్నెల్లు పాటు భూములు.. ఇళ్లు.. స్థలాలు.. పొలాలు కొనే యోగం ఉంటుంది. సోదరుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నతస్థాయికి ఎదుగుతారు.
కన్యా రాశి
ఆర్నెల్ల వరకు ఈ రాశి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలిగే వీలుంది. అప్పులన్నీ తీర్చేయగలరు. రుణ బాధల నుంచి సంపూర్ణంగా బయటపడతారు. శత్రుబాధలు సైతం తొలుగుతాయి.
వృషభ రాశి
ఈ రాశి వారికి వచ్చే ఆర్నెల్లు వారు ఏ రంగంలో ఉన్నా చక్రం తిప్పుతారు. వృత్తి పరంగా మంచి స్థానానికి చేరుతారు. ప్రమోషన్లు రావటం.. ఇంక్రిమెంట్లు లాంటివి పెద్ద ఎత్తున వచ్చే వీలుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే విజయవంతం అవుతారు.కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ గ్రహణం వల్ల అవకాశం ఉందని చెబుతున్నారు.
మేషరాశి
ఆరోగ్య పరంగా.. ఆర్థికంగా.. కుటుంబపరంగా లాభాలు వస్తాయి. అన్ని విషయాలు.. అన్ని వ్యవహారాల్లోనూ ఆర్నెల్ల పాటు విశేషమైన రాజయోగం.. అద్భుతమైన లాభాలు చేకూరనున్నాయి. ఈ నేపథ్యంలో ధనస్సు.. కన్యా.. మేష.. వృషభ రాశి వారు ఎలాంటి దానాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. గ్రహణ సమయంలో నియమాలు పాటిస్తూ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. మంత్రాలు జపించుకోవటం ద్వారా వచ్చే మంచి ఫలితాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.