రెండు రెళ్లు నాలుగు.. ఇది సాధారణ లెక్క.. కానీ, రెండు రెళ్లు ఆరు.. ఇది పొలిటకల్ లెక్క!!. ఎందుకంటే.. ఒక ప్రయోజనం కోసం పొత్తులు పెట్టుకుంటే.. మరిన్ని ప్రయోజనాలు రాబట్టకుంటే.. అది రెండు రెళ్లు ఆరు కాకమరేమవుతుంది- అన్నది సీఎం చంద్రబాబు మాట. ఇది నిజమే కూడా!. గత ఎన్నికలకు ముందు పార్టీని గెలిపించుకునేందుకు మాత్రమే చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టారు. ఇది నిర్వివాదాంశం. అందుకే.. అప్పట్లో భారీ హామీలు ఏవీ గుప్పించలేదు. కేవలం సుపర్ సిక్స్‌కే సరిపుచ్చారు.
కానీ, పొత్తు పెట్టుకుని విజయం దక్కించుకున్న తర్వాత.. అది రెండు రెళ్లు నాలుగు కాదు.. ఆరు అని ఇ ప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన గూగుల్ డేటా కేంద్రమే కాదు.. అమరావతి రాజధానిలో బ్యాంకుల నిర్మాణం, ముఖ్యంగా ఆర్బీఐ వంటి కీలక విభాగం కూడా ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేస్తోంది. దీనికి నిర్ద్వంద్వంగా కేంద్రం కృషి ఉందన్నది వాస్తవం. అందుకే చంద్రబాబు ఆనందలో ఉన్నారు. కేంద్రం కోరకపోయినా.. బీజేపీ నాయకులు అడగకపోయినా.. బీహార్‌లో ప్రచారం చేస్తానని చెప్పారు.
అక్కడితోనే సరికాదు.. సాధారణంగా పొత్తులో ఉన్నప్పటికీ.. బీజేపీ అగ్రనేత, ప్రధాని మోడీ.. ఎవరినీ ప్రశంసించరు. ఎంతో లబ్ధి పొందిన వారిని కూడా ఆయన బహిరంగ వేదికలపై మెచ్చుకున్న దాఖలా ఎక్కడా మనకు కనిపించదు. కానీ.. సీఎం చంద్రబాబు విషయంలో కర్నూలు వేదికగా.. విజన్ ఉన్న నాయకుడిగా.. ప్రశంసించారు. ఈ ఒక్క సందర్భమే కాదు.. కూటమి పాలన 15 మాసాలు పూర్తి చేసుకున్న సమయంలోనూ.. మోడీ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. ఇవి.. చంద్రబాబు రెండురెళ్లు ఆరు అనే లెక్కను సార్థకం చేస్తున్నాయి.
అదేసమయంలో నిధుల విషయంలోనూ .. కేంద్రం ఉదారంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతికి ప్రపంచబ్యాంకు.. 1750 కోట్లు కొన్నాళ్ల కిందట ఇచ్చింది. వీటికి లెక్కలు చూపిస్తేనే తర్వాత 1800 కోట్లు ఇస్తామని చెప్పింది. కానీ, లెక్కలు చూపించలేదు. ఈ విషయంలో కేంద్రం చక్రం తిప్పింది. దీంతో త్వరలోనే 1800 కోట్లు రానున్నాయి. సో. ఇది కూడా చంద్రబాబును ఆనందానికి గురి చేస్తోంది. అదేవిధంగా ఆర్థిక సంఘం నిధులతోపాటు.. బడ్జెట్ ప్రతిపాదనలు, విశాఖ ఉక్కుకు ఇస్తున్న సాయం వంటివి.. ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ ఏర్పాటుకు తోడ్పాటు వంటివి కూడా చంద్రబాబుకు.. కేంద్రం నుంచి రెండు రెంళ్లు ఆరు అన్నట్టుగా సాయం అందుతుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.















