అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలవారీగా సమీక్షించుకోవాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని బేరీజు వేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రతి నెలా రెండు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ, ఎస్ఐపీబీ (SIPB) ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
గత 19 నెలల్లో రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ వినియోగం, ముఖ్యంగా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేయాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశగా క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేశామని, త్వరలో ఉపకరణాల తయారీ మరియు ఎగుమతులు జరిగే పరిస్థితి వస్తుందని తెలిపారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ పనితీరును సమీక్షించడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటున్నామా అనే విషయంపై స్పష్టత వస్తోందని సీఎం చెప్పారు. గత కాలంలో రాష్ట్రాన్ని అగాధం నుంచి బయటకు తీసుకువచ్చి వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
“సూపర్ సిక్స్” పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని సీఎం తెలిపారు. “తల్లికి వందనం” పథకం ద్వారా రూ.10 వేల కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటివరకు 4.29 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని వివరించారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. “అన్నదాత సుఖీ భవ” ద్వారా రూ.6,310 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమలో హార్టికల్చర్ హబ్, కోస్తా ప్రాంతంలో ఆక్వా కల్చర్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అలాంటి సంఘటనలు జరిగితే వాటిని అధ్యయనం చేసి రైతులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు.
ఇంధన రంగంపై కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. కరెంటు చార్జీలు పెంచబోమని, ట్రూ-డౌన్ ఫలితాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా “దీపం 2.0” ద్వారా 2 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామని, “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పథకం ద్వారా రూ.58 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. హాస్టల్ విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల అవసరంపై జరుగుతున్న చర్చలను ప్రస్తావిస్తూ, పేదలను ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరిగా అవసరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
APDevelopment






