ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పాత్రలో కనిపించారు. ఈ మధ్య తరచూ వివిధ రూపాల్లో ప్రజలకు చేరువ అవుతున్న సీఎం గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పేటీఎం)లో టీచర్ పాత్ర పోషించారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి హాజరైన చంద్రబాబు విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించారు. ‘వనరులు’ అనే సబ్జెక్ట్ పై సవివరంగా పాఠాన్ని బోధించిన చంద్రబాబు విద్యార్థులతో సమాధానాలు చెప్పించి ఆకట్టుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు పాఠం చెబుతుండగా, విద్యార్థులతోపాటు ఆయన కుమారుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా బుద్దిగా పాఠం విన్నారు.
చంద్రబాబు 4.O ప్రభుత్వంలో అనేక సరికొత్త కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా ‘పేదల సేవలో’ అనే కార్యక్రమం ద్వారా పింఛన్ల పంపిణీలో భాగమవుతున్న చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ అక్కడికక్కడే తగిన ఆదేశాలిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఓ చర్మకారుడిని తన కారులో ఎక్కించుకుని సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించి అతడి యోగక్షేమాలు, కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు మెగా పేటీఎం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమవడానికి సత్యసాయి జిల్లా వెళ్లిన చంద్రబాబు ఎవరి ఊహాలకు అందని విధంగా నేరుగా ఓ క్లాసురూంలోకి వెళ్లి టీచర్ అవతారమెత్తారు.
వనరులు’ అనే పాఠ్యాంశాన్ని బోధించిన చంద్రబాబు ఎక్కడ తడబడకుండా, ఎంతో కాలంగా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడి వలే పిల్లలకు అర్థమయ్యేల పాఠాన్ని బోధించారు. వనరులు అంటే ఏంటో ఉదాహరణలతో సహా ఆయన వివరించడంతో విద్యార్థులు కూడా ఆయనతో శ్రుతి కలిసి శ్రద్ధగా పాఠాన్ని విన్నారు. బోధిస్తున్నది ముఖ్యమంత్రి అన్న సంకోచం కూడా పిల్లల్లో ఎక్కడా కనిపించలేదు. వనరులు అంటే ఏంటో రాజు వాళ్ల అమ్మను అడిగాడని పాఠాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. మన అవసరాలు తీర్చే వస్తువులనే వనరులు అంటారని తల్లి సమాధానమిచ్చినట్లు వివరించారు. ఇక మనం తాగే నీరు, ప్రయాణించే బస్సు, చదువుకునే పుస్తకం వంటివాటిని కూడా వనరులు అంటారని చెప్పారు. అదేవిధంగా సౌర విద్యుత్ ను పునరుత్పాదక ఇంధన వనరు అంటామని సోలార్ పవర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు వారు భవిష్యత్తులో ఏం అవ్వాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫొటోలు దిగారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.