ఐటీ అంటేనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దడంలో ఆయన కృషిని ఎవరూ మరవలేరని చంద్రబాబు మద్దతు దారులు చెబుతుంటారు. అదే సమయంలో ఐటీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు.
ఏది ఏమైనా ఐటీ అంటే చంద్రబాబే అని చాలా మంది చెబుతారు. ఇక చంద్రబాబు పరిపాలన కూడా ఎక్కువగా ఐటీ ఆధారంగానే కొనసాగుతుంది. ఆధునిక సాంకేతికతను వాడుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు చెబుతుంటారు. అయితే తనకు ఇంతలా గుర్తింపు తీసుకువచ్చిన ఐటీ రంగం ప్రస్తుతం ఈ దశలో ఉండటానికి ఓ ముఖ్యనేత కారణమని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నేతగానే ఆ మహా నేతకు గుర్తింపు ఉండగా, ఐటీ విప్లవానికి నాంది పలికింది కూడా ఆయనే అంటూ మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు కోసం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
దేశంలో ఐటీ విప్లవం క్రెడిట్ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘లెక్చర్ సిరీస్’ 6వ ఎడిషన్ కార్యక్రమంలో ‘లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ’ అన్న అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు దివంగత ప్రధాని పీవీలోని అనేక కోణాలను ఆవిష్కరించారు. ఐటీని దేశంలో విస్తృత పరిచిన ప్రధానిగా పీవీకి ఖ్యాతి దక్కుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా దేశంలో మొబైల్ ఫోన్లు ఇతర కమ్యూనికేషన్ రంగాలు అభివృద్ధికి పీవీనే కారణమని చంద్రబాబు వెల్లడించారు. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలతోపాటు ఇతర సంస్కరణలను ప్రవేశపెట్టిన పీవీ దేశంలో అభివృద్ధికి బాటలు పరిచారని చెప్పారు. లైసెన్స్ రాజ్ నిబంధనల నుంచి దేశాన్ని బయటకు తెచ్చిన ఘనత కూడా పీవీకే దక్కుతుందని ఆయన కొనియాడారు.
ప్రధానిగా పీవీ తెచ్చిన అనేక సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్ గా మారాయని చంద్రబాబు తెలిపారు. ఐటీ విప్లవానికి ఆయన పునాదులు వేయడం వల్లే మన దేశంలో ఐటీలో ఈ స్థితికి చేరుకుందని చెప్పారు. మైనార్టీ ప్రభుత్వంలోనూ పీవీ చాలా లౌక్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు. పీవీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి కూడా పీవీ విధానాలు కొనసాగించారని కొనియాడారు.
పీవీ మాదిరిగా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా సంస్కరణలతో పాలన సాగిస్తున్నారని అభినందించారు. ఇదే సమయంలో ఏపీలో గత ప్రభుత్వం విధ్వంసానికి ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. తాను అమరావతి రాజధానిని ప్రతిపాదిస్తే, ముందుగా ఒప్పుకుని తర్వాత ధ్వంసం చేశారని ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.