ఎంపీలు అంటే వారి పరిధి పెద్దది, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అయితే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు. దాంతో ఎంపీలు అనేక పార్టీలలో చూస్తే కనుక ఢిల్లీలో ఎక్కువ కాలం గడుపుతారు అన్న ప్రచారం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎంపీలకు కీలక సూచనలు చేస్తోంది. అయితే పార్లమెంట్ సమావేశాలలో ఉండాలని, అవి అయిపోయిన తర్వాత జనంలోనే ఉండాలని కోరింది. దీని మీద అధినేత చంద్రబాబు అయితే ఎంపీలకు చేయాల్సిన సూచనలు చేశారు.
విపక్ష వైసీపీ ఏపీలో ప్రైవేట్ లోకి మెడికల్ కాలేజీలు అని ప్రచారం చేస్తోంది అని బాబు ఎంపీల దృష్టికి తెచ్చారు. కానీ అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు. పీపీపీ మోడల్‌లో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తులేనని బాబు స్పష్టం చేశారు వీటిలో 70 శాతం సేవలు ఉచితమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన ఎంపీలను కోరారు, విపక్షం చేసే ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎంపీలు జనలోకి వెళ్ళి ఇవన్నీ వివరించాలని ఆయన సూచించారు. ఇక ప్రతి పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ఎంపీల సహకారం అవసరమని అందువల్ల వారు పూర్తిగా వీటికి సహకరించాలని కోరారు.
టీడీపీ ఎంపీలు ఇక మీదట పూర్తిగా ప్రజల మధ్య ఎంపీలు ఉండాలని బాబు కోరారు. ప్రతీ ఎంపీ పార్లమెంటులో చురుగ్గా ఉండటంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించాలని కోరారు. అదే విధంగా పార్లమెంట్ అయిపోగానే తమ నియోజకవర్గాల్లో పేదల కోసం జరుగుతున్న పేదల సేవలో వంటి కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టీడీపీలో ఉన్న యువ పార్లమెంటేరియన్లు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను తెలియచేస్తూ తాము ఉన్నామన్న నమ్మకం కలిగించాలని సూచించారు. ప్రజా సేవే ఎంపీలు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గమని చెప్పారు.
ఎంపీలు పార్టీ కార్యక్రమాలలో కూడా గతానికి కంటే ఎక్కువగా ఇక మీదట పాల్గొనాలని బాబు చెప్పారు అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఎంపీలు క్రియాశీలకంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఎంపీల మీద ఉందని ఆయన అన్నారు. ఎంపీలు ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. గత పాలకుల విధ్వంసం కారణంగా ఏపీకి మరి కొంత కాలం ఇబ్బందులు తప్పవని ఈ విషయాలను ప్రజలకు వివరిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్న వైనాన్ని తెలియచేయాలని బాబు కోరారు.
ఎంపీలు అంతా రాజకీయంగా తమ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలని చంద్రబాబు సూచించారు. అనవసరపు వివాదాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు వివాదాలతో ఎంపీలకు వ్యక్తిగతంగానూ అలాగే పార్టీకి కూడా నష్టం కలుగుతుందని బాబు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల పనితీరు మీద ప్రతీ వారం వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని బేరీజు వేస్తున్నామని ఈ విషయం అంతా గురించి తమ విధులను సక్రమంగా నెరవేర్చాలని కోరారు.
ఏపీలో టీడీపీ కేంద్రంలో అధికార ఎన్డీయేలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విధితమే. టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలే కేంద్ర ప్రభుత్వం మనుగడుకు ప్రధాన ఆధారంగా ఉన్నారు. దాంతో గతంతో పోలిస్తే టీడీపీ ఎంపీల పాత్ర పార్లమెంట్ లో చాలా ఎక్కువగా పెరిగింది. ఒక వైపు అధికార పక్షంలో ఉంటూనే మరో వైపు విభజన ఏపీకి అవసరం అయిన అన్ని అంశాల మీద పార్లమెంట్ వేదికగా కోరాల్సిన పరిస్థితి ఉంది ఏపీ ప్రయోజనాల విషయంలో పట్టుబట్టాల్సి ఉంది. దాంతో టీడీపీ అధినాయకత్వం ఎంపీల మీద పెద్ద బాధ్యతనే మోపుతోంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. దాంతో ఈ సమావేశాలలో చర్చినాల్సిన అంశాల గురించి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన తాజాగా టీడీపీ లోక్ సభ రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధి ప్రజా ప్రయోజనాలే అజెండాగా చేసుకుని పార్లమెంట్‌లో రాష్ట్ర అంశాలు ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అంతే కాదు ఏపీలో అనేక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకుని రావాలని అదే విధంగా రైతు సమస్యలకు పరిష్కారం కూడా కనుగొనాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇక చూస్తే అత్యధిక యువ పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పారు.అలా యువ శక్తి పార్లమెంట్ వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందని బాబు కోరారు. రాష్ట్రాభివృద్ధితో పాటుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు అంతా సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్‌లో రాష్ట్ర గొంతుకను వినిపించాలని ఎంపీలకు బాబు స్పష్టం చేశారు. అలాగే వంశధార గోదావరి నల్లమల సాగర్ అనుసంధానంతో పాటుగా వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్‌ని నిర్ణయిస్తాయని బాబు ఎంపీలకు గుర్తు చేశారు. వీటి కోసం పార్లమెంట్ లో మాట్లాడాలని అన్నారు.
అదే విధంగా విభజన ఏపీకి నీటి భద్రత చాలా ముఖ్యమని జల వనరులే రాష్ట్రానికి ఆస్తి అని బాబు చెప్పారు. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలని బాబు సూచించారు. పత్తి మొక్కజొన్న అరటి ధరల పతనం కేంద్రం దృష్టికి తేవాలని సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలకు బాబు వివరించారు.
ఏపీలో గ్రోత్ ఇంజన్లుగా అనేక ప్రాజెక్టులు వస్తున్నాయని బాబు చెప్పారు. అలా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లకు అవసరమైన శక్తి వసతులపై కేంద్ర సహాయం ఎంపీలు పూర్తి స్థాయిలో సాధించాలని కోరారు. ఇక ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఎంఎస్ఎంఈ పార్కులు, 4ఘ్–5ఘ్ కనెక్టివిటీ, క్వాంటం వ్యాలీ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు మద్దతు సాధించేలా చూడాలని అన్నారు. విశాఖ–విజయవాడ మెట్రో రైలు, విశాఖ-తిరుపతి-అమరావతి ఎకనామిక్ రీజియన్స్ భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ రైల్వే జోన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో మాట్లాడి సపోర్టుని తీసుకోవాలని అన్నారు. మొత్తానికి ఈసారి వింటర్ సెషన్ కోసం బాబు తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తూనే అనేక కీలక బాధ్యతలను వారి మీద పెట్టారు.


















