అచ్చ తెలుగువాడైన 36 ఏళ్ల విజయ్ దేవరకొండ.. 29 ఏళ్ల కన్నడ భామ రష్మిక మందన్నా ఊహాగానాలకు తెరదించారు… ఇప్పటివరకు జంటగా పలు విహార యాత్రల్లో కనిపించిన వీరు ఇకపై జంటగా మారనున్నారు. నేషనల్ క్రష్‌ను రౌడీ స్టార్ వివాహమాడనున్నారు. బహుశా తెలుగు హీరో ఒకరు కన్నడ (బహు భాషా) హీరోయిన్‌ను చేసుకోవడం ఇదే ప్రథమం ఏమో..? విజయ్-రష్మిక చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
ఒకే రకమైన దుస్తులు ధరించడం సహా వీరిద్దరి సాన్నిహిత్యం కూడా దానికి బలం చేకూర్చింది. ఈ మేరకు సంకేతాలు కూడా వచ్చినా.. తమ బంధాన్ని వీరు ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారు. శుక్రవారం రష్మిక, విజయ్ కుటుంబాలు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని విజయ్ ఇంట్లోనే వీరి నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం.
2012లో లైఫ్‌ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో విజయ్ వెండితెరకు పరిచయం అయ్యారు. 2016లో కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో రష్మిక తొలి సినిమా చేశారు. వీరిద్దరు కలిసి తెలుగులో నటించిన గీత గోవిందం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌లోనూ నటించారు. మొదట పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి పీటలకు చేరింది. ఈ మేరకు ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నట‍్లు తెలుస్తోంది.
విజయ్ ఇటీవల కింగ్‌డమ్ సినిమాతో విజయం అందుకున్నాడు. రష్మిక ఛావా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇద్దరి చేతిలోనూ పెద్ద ప్రాజెక్టులున్నాయి. దీంతో మరి వివాహం ఎప్పుడు? అనే ప్రశ్న వస్తోంది. బహుశా వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఉంటుందని సమాచారం. దీనిపై విజయ్-రష్మిక ప్రకటన విడుదల చేస్తారని భావిస్తున్నారు.
విజయ్‌ను స్టార్‌ను చేసిన సినిమా అర్జున్‌రెడ్డి. 2017లో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ రీమేక్ అయి హిట్ కొట్టింది. ఇక రష్మిక పుష్ప సిరీస్‌లోని శ్రీవల్లి క్యారెక్టర్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగింది. ఛావాతో బాలీవుడ్‌లో తన సత్తాచాటింది. ప్రస్తుతం తమిళం, తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.