ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒకపక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు ఏపీలో ప్రతిదీ ప్రజల ఇళ్ల వద్దకే చేరాలని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని అనేక ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే whatsapp ద్వారా పౌర సేవలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో శుభవార్తను అందించింది. ఇకపై కుల దృవీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికే పంపే విధానాన్ని ఏపీ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండవ తేదీ నుండి నేరుగా ఇంటికి వెళ్లి కుల ధ్రువీకరణ పత్రాన్ని అందించనున్నారు.
ఈ సర్వేలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు, పాత కుల ధ్రువీకరణ పత్రం వంటి వివరాలను పరిశీలిస్తున్నారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత అర్హులైన వారికి పత్రాలను సులభంగా అందించడానికి రెవిన్యూ శాఖ కృషి చేస్తోంది. గత కొద్దిరోజులుగా చాలామందికి మీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ దరఖాస్తు అందింది. 25 రోజుల్లో ప్రాసెస్ పూర్తి అవుతుంది అంటూ సెల్ ఫోన్ లకు మెసేజ్ లు వస్తున్నాయి.
ఇక తాము దరఖాస్తు చేయకపోయినా ఈ మెసేజ్ లు రావడంతో కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ప్రభుత్వం తమకు కుల దృవీకరణ పత్రాలు అందించడానికి, అది ఇంటికి నేరుగా తెచ్చి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంగా తెలిసి పలువురు సంతోషపడుతున్నారు. ప్రభుత్వం సర్వే ఆధారంగా సుమోటోగా విచారణ జరిపి, అర్హులను తేల్చి వారికి కుల దృవీకరణ పత్రాన్ని నేరుగా ఇంటికే అందించనుంది.
గతంలో మాదిరిగా సచివాలయాల చుట్టూ, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీలోపు ఈ సర్వేను పూర్తి చేసి ఆ తర్వాత మిగతా ప్రొసీజర్ జరిగి ప్రజలు సులభంగా కుల దృవీకరణ పత్రాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలోనూ వీఆర్వోలు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. కొత్తగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీ వాసులకు ఇంటి వద్దకే కుల ధ్రువీకరణ పత్రం రాబోతుంది.
 
			



















