సాధారణ పౌరులకు పట్టుమని పది పేజీలుచదివే ఓపిక కూడా లేని ఈ రోజుల్లో ఏకంగా 88 కోట్ల పేజీల సర్వే అంటే.. ఎవరైనా ముట్టుకుంటారా? ఎవరైనా కనీసం.. దానిని ఆమూలాగ్రం పరిశీలించే వీలుంటుం దా? అంటే.. చెప్పడం కష్టం. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం.. ఔననే అంటున్నారు. తాము ప్రతిష్టాత్మకంగా చేయించిన కుల గణన సర్వే విషయాన్ని తాజాగా ఢిల్లీలో ప్రస్తావించిన ఆయన.. తమ సర్వే రిపోర్టు 88 కోట్ల పేజీల్లో ఉందని చెప్పుకొచ్చారు. దీనిని ఎవరైనా చదువుకోవచ్చని కూడా సెలవిచ్చారు.
వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న జనాభానే 4.32 కోట్ల మంది. వారికి సంబందించిన కుల గణన నివేదిక మహా అయితే.. దీనికి డబుల్ వేసుకున్నా.. 10 కోట్ల పేజీల్లో ఉంటుంది. ఉండాలి కూడా. కానీ.. ఏకంగా 88 కోట్ల పేజీల్లో నివేదికలు సిద్ధం చేశామని ఆయన చెబుతున్నారంటే.. ఎవరికి మాత్రం దీనిని చదివే ఓపిక.. పరిశీలించే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయాన్ని అటు ఉంచితే.. అసలు ఏ పేజీలో ఏముందో తెలుసుకునే `పీఠిక` ఏకంగా 32 పేజీలపైగానే ఉందని చెప్పుకొచ్చారు.
దీనిని చదివేందుకు కూడా ఓపిక ఉండాలి. ఏదైనా సర్వే చేయించినప్పుడు.. అది సాధారణ ప్రజలకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి. కానీ.. 88 కోట్ల పేజీల్లో ఉంది.. చదువుకోండి.. అంటే.. అది అసాధ్యం. కానీ.. సర్కారు మాత్రం ఇదే చెబుతోంది. దీంతో దీనిపై మేధావి వర్గాలు కూడా పెదవి విరుస్తున్నాయి. దీనిని చదివి అర్ధం చేసుకునే సరికే.. పెద్ద సమస్య అని నిత్యం మీడియాలో ఉండే ఓ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. దీనిని ఉద్దేశ పూర్వకంగా చేశారని అనడం లేదుకానీ.. ఇంత పెద్ద నివేదికను చదివే ఓపిక, ఓర్పు ఎవరికి మాత్రం ఉంటుందన్నదే ప్రశ్న.
ఈ సర్వేను ఇతరుల మాట ఎలా ఉన్నా.. కనీసం అధికార పక్షంలో ఉన్న వారైనా చదివారా? అనేది ప్రశ్న. దీనిని చదివి అర్ధం చేసుకునే సరికి పుణ్యకాలం గడిచిపోతుందని చెబుతున్నారు. పైగాదీనిని డిజిటల్ రూపంలో తీసుకువస్తున్నట్టు సీఎం చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. ఇది.. కొరకరాని కొయ్యగానే మారుతుంది. ప్రభుత్వం గొప్పగా చెబుతున్నప్పటికీ.. అది సాధారణ ప్రజలకు చేరితేనే.. ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అంతేతప్ప.. 88 కోట్ల పేజీల్లో నివేదిక ఇచ్చామని గొప్పగా చెబుతున్నా.. అది ప్రయోజనం ఇవ్వనప్పుడు వృథానే కదా! అనేది ప్రశ్న.