ఏపీ ప్రతిపక్షం వైసీపీలో అమరావతి రాజధాని సెగ పెరుగుతోంది. ప్రజలకు సెంటిమెంటుతో కూడుకున్న ఈ వ్యవహారం తమను పుట్టిముంచిదన్న వాదన ఉంది. మూడు రాజధానుల పిలుపు అందుకు.. పార్టీ నష్ట పోయిందన్న భావన కూడా ఉంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఇటీవల పార్టీ కీలక నేత, రాష్ట్ర రాజకీయ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సెగ పెంచాయి. రాజధాని విషయంలో తమ వైఖరి మారిందని నేరుగా ఆయన చెప్పకపోయినా.. దాదాపు అలాంటి వ్యాఖ్యలు చేశారు.
తాముఅధికారంలోకి వచ్చినా.. రాజధాని అమరావతి కొనసాగుతుందని.. దీనిపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. విస్తృత పరిధిలో నిర్మించడానికి.. ఒక నగారన్ని నిర్మించడానికి మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. అంటే.. దాదాపు అమరావతి వైపే వైసీపీ మొగ్గు చూపిస్తోందన్న ధోరణిని ఆయన స్ప ష్టం చేశారు. దీనిని మెజారిటీ నాయకులు తప్పుబడుతున్నారు. తడవకోమాట.. పూటకో నిర్ణయం సరికాద ని తేల్చి చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
“మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుని ప్రకటించేస్తే.. మేం సమర్థించలేక ఇబ్బందులు పడుతున్నాం.“ అని చాలా మంది నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైసీపీ అంటే ఒక బ్రాండ్ ఉందని.. ఇది ఇప్పుడు ఏమైందని కూడా కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతర్గతంగా చర్చలు లేకుండా రాజధానిపై ఒక విధానం ప్రకటించకుండా.. ఇలా ఎలా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా నిలదీస్తున్నారు. దీంతో అసలు సజ్జల ప్రకటించిన వ్యాఖ్యలు.. ఆయన సొంతమా? లేక , జగనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేది కూడా చర్చకు వస్తోంది.
వాస్తవానికి అమరావతికి జగన్ వ్యతిరేకం కాకపోయినా.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు మా త్రం ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులను ఎంచుకున్నారు. అయితే.. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వైసీపీ నాయకులు విఫలమయ్యారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పడం ద్వారా రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలోఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాటిని సమర్థించలేక ఇబ్బందులు పడుతున్నామని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.