కాగ్ రిపోర్టు విడుదలైన వేళ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్ర అప్పులపై ఆసక్తికర పోస్టు చేశారు. అందులో తమ పాలనలోని ఐదేళ్లలో తెచ్చిన అప్పులు వర్సెస్.. పద్నాలుగు నెలల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుల వివరాల్ని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే సంపదను క్రియేట్ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన పద్నాలుగు నెలల వ్యవధిలో భారీగా అప్పులు చేసినట్లుగా జగన్ పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తాను చెప్పటం లేదని. కాగ్ వెల్లడించిన రిపోర్టులోని అంశాల్ని మాత్రమే తాను చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయిందని.. అప్పులు పెరిగినట్లుగా కంపోట్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టులో వెల్లడైనట్లుగా జగన్ పేర్కొన్నారు. 2024-25లో కేంద్ర ప్రభుత్వ ఆదాయాభివృద్ధి 12.04 శాతం పెరిగితే.. ఏపీ రాష్ట్ర ఆదాయాభివృద్ధి మాత్రం 3.08 శాతం వద్దే ఆగిన విషయాన్ని ప్రస్తావించారు.
ఎందుకిలా జరిగింది? ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోయింది ఎందుకు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆదాయ వృద్ధి 2.39 శాతం మాత్రమే ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారంలో ఉన్న చంద్రబాబు సంపదను ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నట్లు? అంటూ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో అన్ని రకాల అప్పులు కలిసి ఐదేళ్ల వ్యవధిలో చేసిన అప్పుల లెక్క చెప్పిన జగన్. పద్నాలుగు నెలల వ్యవధిలో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పుల్ని విశ్లేషించారు. ఐదేళ్ల తమ పాలనలో మొత్తం రూ.3.32 లక్షల కోట్ల అప్పులు తేగా.. పద్నాలుగు నెలల స్వల్ప వ్యవధిలో కూటమి ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసినట్లుగా వెల్లడించారు. మరి.. దీనికి చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఏం చెబుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.