ఏపీలో ఇపుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చాలా మంది జాతకాల మీద సోషల్ మీడియా విశ్లేషణలు ఎక్కువైపోయాయి. కూడికలు తీసివేతలు కూడా వారే చేస్తూ లిస్టులను రిలీజ్ చేస్తున్నారు. ఇది ట్రెండింగ్ మారుతోంది కాబట్టి ఎవరు ఉంటారు ఎవరు ఊడతారు, వారి ప్లేస్ లో కొత్తగా వచ్చే వారు ఎవరు అన్నది అయితే పెద్ద ఎత్తున డిస్కషన్ గా సాగుతోంది.
ఇదిలా ఉంటే చాలా జిల్లాలలో మంత్రులుగా అనీక మంది పేరులు వినిపిస్తున్నాయి. కానీ ఒక పేరు అయితే తర్కానికి దగ్గరగా ఉంది. పైగా ఈ మధ్యనే ఆమె వర్సెస్ వైసీపీ హాట్ ఇష్యూ కూడా జరగడంతో ఏపీ వ్యాప్తంగా ఆ పేరు మారుమోగింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఇక నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. మరో వైపు ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు ఎంపీగా లోక్ సభలో గెలిచి జిల్లా రాజకీయాల్లో అతి ముఖ్యుడిగా ఉంటున్నారు. ఆయన వాస్తవానికి తన సతీమణి ప్రశాంతి రెడ్డికి మొదట్లోనే మంత్రి పదవిని ఆశించారు. కానీ అది జరగలేదు ఇపుడు అనేక ఈక్వేషన్లు చూసుకుంటే ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి కంఫర్మ్ అని అంటున్నారు. ఎపుడు కేబినెట్ లో మార్పు చేర్పులు జరిగినా కూడా ఇది తధ్యమని అంటున్నారు. ఆమె గత ఏడాదిగా కోవూరు ఎమ్మెల్యెగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆర్ధికంగా కూడా బలంగా ఉండడంతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా చాలా సమస్యలను తమ ట్రస్టు ద్వారా తమ ద్వారానే పరిష్కరిస్తున్నారు. అంతే కాదు ఆమె టీడీపీ అధినాయకత్వం దృష్టిలో కూడా మంచిగానే ఉన్నారు. ఆమెకు పార్టీ చేయించిన అధ్యయనాలలో మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు.
ఇక లేటెస్ట్ గా చూస్తే కనుక కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి రెడ్డిగా వార్ సాగుతోంది. కోవూరు విషయానికి వస్తే అది వైసీపీకి కంచుకోట లాంటి సీటు. ఇక ప్రసన్నకుమార్ రెడ్డికి తన వారసత్వంగా దక్కిన సీటు ఇది నల్లపురెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం కట్టుబడి ఉంది. ఇపుడు ప్రశాంతి రెడ్డి అక్కడ పాగా వేశారు. ఆమె మరింత బలపడడమే కాదు ఆ సీటుని శాశ్వతం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమెని మంత్రిని కనుక చేస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వైసీపీకి కోవూరుతో పాటు జిల్లా మొత్తం మీద చుక్కలు చూపించినట్లు అవుతుందని అంటున్నారు. దాంతో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మీద అనుచితమైన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే చేశారు అన్న దాని మీద టీడీపీ సహా కూటమి అంతా ఒక్కటిగా నిలిచి మద్దతు ఇచ్చింది. ఇపుడు ఇది చాలదన్నట్లుగా ఏకంగా ఆమెనే మంత్రిగా చేసి జిల్లాకు పంపిస్తే వైసీపీకి చుక్కలు కనిపిస్తాయని అంటున్నారుట.