బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడింది. ఎన్డీయేను ఓడించేందుకు మహా కూటమి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ ఝా ప్రకటించారు. ఈ మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎంఎల్), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ఉన్నాయి. ఆదివారం పాట్నాలో కూటమి నేతలతో జరిగిన కీలక సమావేశానంతరం ఎంపీ మనోజ్ ఝా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీయేను ఓడించేందుకు ఇండియా కూటమి భాగస్వాములంతా బూత్ స్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేయనున్నట్టు చెప్పారు. ”మేం ఐక్యంగా ఉన్నాం. ప్రతి సీటుకూ గట్టిపోటీ ఇస్తాం. ఎన్డీయేను ఓడిస్తాం” అని చెప్పారు. కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా మే 20న జరుగనున్న వర్కర్స్ స్ట్రైక్‌కు ఇండియా కూటమి మద్దతిస్తుందని, సంఘీభావం తెలుపుతుందని తెలిపారు.
బీహార్(Bihar) మహాకూటమికి తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తు విషయంలో సీఎం అభ్యర్ధి తానే అంటూ వస్తున్న ఊహాగానాలను మనోజ్ ఝా కొట్టివేశారు. ప్రస్తుతానికి తేజస్వి యాదవ్ నాయకత్వం విషయంలో ఎలాంటి వివాదం లేదన్నారు. సరైన సమయంలో ప్రకటన వెలువడుతుందని, ఇందుకు అందరూ కట్టుబడి ఉన్నారని చెప్పారు. కులగణనపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అది తమ కూటమి ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఈరోజుకూ అది తమ ప్రధాన అంశమేనని అన్నారు. కులగణన జరిగేంతవరకూ తమ ఫోకస్ దానిపైనే ఉంటుందని, షేర్ చేసిన డాటా సరైనదేనా అనే విషయంలో ఒక కన్నేసి ఉంచుతామని వివరించారు. దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద సంబంధిత ఘటనలను మనోజ్ ఝా ఖండించారు. జాతీయ భద్రతకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ఇందులో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టంచేశారు. కాగా, ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) జరగాల్సి ఉన్నాయి.