మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పులు చేసుకోవటమే కాదు.. ఏళ్లకు ఏళ్లుగా ఎంతో మంది బ్యాంకు ఖాతాదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చేపేలా నిర్ణయం తీసుకోవటమే కాదు.. వాటి అమలు నవంబరు 1 నుంచి షురూ కానుంది. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాదారుడికి జరగరానిది జరిగినప్పుడు ఆ ఖాతాను సెటిల్ చేసే విషయంలో వారసులకు పెద్ద సవాలుగా ఉండేది. లాకర్ ఉంటే అది మరింత పెద్ద సమస్య.
నవంబరు ఒకటి నుంచి ఈ తరహా కష్టాలకు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఈ మార్పులకు సంబందించి బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం 2025ను ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించింది. ఇంతకూ మరో నాలుగైదు రోజుల్లో బ్యాంకులకు సంబంధించి వచ్చే మార్పులు ఏమిటన్న విషయంలోకి వెళితే..
ఇప్పటివరకు బ్యాంకు ఖాతాకు ఉండే నామినీల సంఖ్యకు నాలుగుకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురిని ఒకేసారి లేదంటే ఒకరి తర్వాత ఒకరు చొప్పున నామినేట్ చేయొచ్చు. ఈ మార్పు కారణంగా జరగరానిది జరిగితే సెటిల్ మెంట్ తేలిక కానుంది. కాబట్టి.. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఎవరైనా సరే.. తమ నామినీల సంఖ్యను పెంచేసుకోవచ్చు. – లాకర్ల.. సేఫ్ కస్టడీలోని వస్తువులకు సంబంధించిన విషయంలోనూ నామినేషన్ కు అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతాదారుడు ఇచ్చిన వరుస క్రమం ప్రకారం మాత్రమే నామినీలకు లాకర్లను నిర్వహించే అధికారం ఉంటుంది.
బ్యాంకు ఖాతాదారుడు తన డిపాజిట్ లేదంటే లాకర్ లోని వస్తువుల్లో ఏ నామినీకి ఎంత మొత్తం (ఎంత శాతం) చెల్లించాలన్న విషయాన్ని ముందే బ్యాంక్ కు తెలియజేసే వీలుంది. అయితే.. ఇది నలుగురికి మాత్రమే పరిమితం అవుతుంది. – కొత్త నిబంధనలతో క్లెయిమ్ ల పరిష్కార ప్రక్రియ వేగంగా పారదర్శకంగా జరగనుంది. క్లెయిమ్ ల పరిష్కారంలో అలసత్వం.. వివాదాలకు చెక్ పడనుంది. కొత్త చట్టం ప్రకారం నామినేషన్ల కోసం ఒకే అప్లికేషన్ ను ఫాలో అవుతాయి. దీంతో.. డాక్యుమెంటేషన్ తేలిక కానుంది.
జాయింట్ బ్యాంకు ఖాతాల విషయానికి వస్తే.. పరస్పర అంగీకారంతో నామినీ వివరాల్ని ఎప్పటికప్పుడు అప్టేట్ చేసుకునే వీలుంది. దీని కారణంగా ఖాతాదారుడికి జరగరానిది ఏమైనా జరిగినా క్లెయిమ్ సెటిల్ మెంట్ ఈజీ అవుతుంది. – బ్యాంకులు సైతం ఈ మార్పులను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ పద్దతిలోనే రికార్డుల్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మానవ తప్పిదాలకు అవకాశం ఉండదు. బ్యాంకుల మీద జవాబుదారీతనం కూడా పెరుగుతుంది.
















