హైదరాబాద్ మహానగరంలోని పాత నగరంలో భాగమైన బాలాపూర్ లో దారుణ హత్య చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో ఆమెను అమానుషంగా చంపేసిన వైనం వెలుగు చూసింది. పక్క గదిలో పిల్లలు నిద్రపోతున్న వేళ.. ఆమెను అత్యంత అమానవీయంగా చంపేయటం సంచలనంగా మారింది. గోల్కొండలో ఉండే 31 ఏల్ల జాకీర్ అహ్మద్ కు ఇద్దరు భార్యలు. రెండో భార్య 30 ఏళ్ల నాజియా బేగం. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఆమెపై భర్తకు అనుమానం. ఇది కాస్తా పెరిగి పెద్దదై భూతంగా మారింది. ఆమె మీద ఉన్న అనుమానంతో ఇంటిని జల్ పల్లి కొత్తపేట కాలనీకి మార్చాడు. అప్పటి నుంచి ఆమెను రహస్యంగా గమనిస్తూ ఉన్నాడు. ఈ నెల 13రాత్రి పదకొండు గంటల వేళలో ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో నిద్రపోతున్నారు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ నిలదీశాడు.
దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కట్టలు తెగిన కోపంతో భార్యను కర్రతో తలపై బాదాడు. ఆ దెబ్బల ధాటికి రక్తపు మడుగులో కుప్పకూలింది. అయినా ఆమె మీద కోపం తగ్గని జాకీర్.. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఒక ముక్కతో ఆమె కుడిచేయి నరాల్ని కోసేశాడు. చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ గొడవకు నిద్ర లేచిన పిల్లలు భయంతో వణికిపోయారు. తల్లిని చంపేసిన విషయాన్ని అమ్మమ్మకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో.. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. నాజియా బేగం తల్లి.. సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న జాకీర్ అహ్మద్ ను పట్టుకునేందుకు పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.