ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా అధికారపక్షానికి చుక్కలు చూపించటం విపక్షానికి కొత్తేం కాదు. అయితే.. ఈ తీరు ఏపీలో శ్రుతి మించి రాగాన పడుతోంది. ఎంత న్యాయస్థానం బెయిల్ ఇస్తే మాత్రం.. పొద్దుపొద్దున్నే ఐదున్నర గంటల వేళకు జైలు వద్దకు చేరుకొని రచ్చ చేయటం.. బెయిల్ ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత.. జైలు నుంచి విడుదల చేయటానికి ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బయట జరుగుతున్న రచ్చను అందిపుచ్చుకొని జైల్లో ఉన్న వైసీపీ నేతలు చేసిన హడావుడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
మద్యం స్కాంలో నిందితులు విజయవాడ జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జైల్లో ఉన్న ధనుంజయ్ రెడ్డి.. క్రిష్ణమోహన్ రెడ్డి.. గోవిందప్ప బాలాజీలకు శనివారం ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. వీరిని ఆదివారం ఉదయం 7 -10 గంటల మధ్యలో విడుదల చేస్తామని.. వైసీపీ నేతలకు జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే.. తెల్లవారుజామున ఐదున్నర గంటలకే విజయవాడ జిల్లా జైలు వద్దకు చేరుకున్న వైసీపీ నేతలు.. వారి కార్యకర్తలు.. బెయిల్ వచ్చిన తమ వారిని వెంటనే విడుదల చేయాలంటూ హడావుడి చేయటం షురూ చేశారు.
ఎంత చెప్పినా వారు వినని పరిస్థితి. ముందు రోజు చెప్పినట్లే జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ మచిలీపట్నం నుంచి ఉదయం 8.30 గంటల్లోపే జైలుకు వస్తానని.. వెంటనే విడుదల ప్రక్రియ షురూ చేసి.. విడుదల చేయాలంటూ జైలు వద్ద హంగామా చేయటమేకాదు.. నినాదాలు చేయటం.. జైలు తలుపుల్ని బాదటం లాంటివి చేపట్టారు. ఇదిలా ఉంటే.. జైల్లో బెయిల్ రాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే పనిగా చెలరేగిపోయారు. ఎందుకు వదలటం లేదు? మీకు హక్కు ఉందంటూ పెద్ద ఎత్తున అరుపులు కేకలతో జైలు దద్దరిల్లేలా చేశారు. ఈ అరుపులతోజైలు బయట ఉన్న వైసీపీ నేతలు చెవిరెడ్డికి వంతపాడుతూ.. జైల్లో ఉన్న తమ వారిని ఏం చేస్తున్నారంటూ హడావుడి చేయటం మొదలు పెట్టారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో బెయిల్ లభించిన గోవిందప్ప బాలాజీ తన తలను జైలు గోడకు కొట్టుకున్నట్లుగా వ్యవహరిస్తూ జైలు అధికారులకు.. సిబ్బందికి చెమటలు పట్టేలా చేశారు. తమ వాళ్లను జైలు లోపల ఏం చేస్తున్నారంటూ బయట హడావుడి చేయటం మొదలు పెట్టారు.
శనివారం చెప్పినట్లే ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు జైలర్ రాగా.. ఎనిమిదిన్నరకు సూపరిండెంట్ జైలుకు రావటంతోనే అప్పటికే సగం పూర్తి చేసిన బెయిల్ పై విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. ఉదయం ఆరు గంటల నుంచే తాము జైలు బయట వెయిట్ చేస్తుంటే.. అధికారులు కావాలనే తమ వాళ్లను విడుదల చేయటంలో ఆలస్యం చేశారని ఆరోపిస్తూ రచ్చ చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. శనివారం జైలర్ ఏం సమయంలో నేతల్ని విడుదల చేస్తామని చెప్పారో అదే సమయానికి విడుదల చేసినా.. వైసీపీ బ్యాచ్ మాత్రం జైలు దగ్గర చేసిన రచ్చ జైలు సిబ్బందిని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఏమైనా.. ఇలాంటి తీరును ప్రదర్శించాలంటే వైసీపీకి మాత్రమే సాధ్యమన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.