బ్యాడ్ హ్యాబిట్ – 1
తిండి తిప్పలు తల్లిదండ్రులు పిల్లలకు మందు, స్మోకింగ్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల గురించి ఒకటికి రెండుసార్లు హెచ్చరిస్తారు. కానీ, మరికొన్ని చెడు అలవాట్ల గురించి మాత్రం వారు పట్టించుకోరు. ఎందుకంటే, అవి చెడ్డవని వారికి తెలియదు! ఇంకా చెప్పాలంటే, ఆ అలవాట్లలో తమ పిల్లలు “టాపర్”లుగా ఉండాలని కూడా కోరుకుంటారు. అలాంటి అలవాట్లలో మొదటిది తిండి.తిండి ఔషధమా, విషమా?”ఆరోగ్యానికి ఔషధం ఏంటో తెలుసా? భోజనం. మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం,” అని చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ అక్షరాలా నిజం. కానీ, మనం ఈ సత్యాన్ని మరచిపోయి, కడుపు నిండా తింటూ ఆరోగ్యాన్ని పణంగా పెడతాం.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కపక్కన నిలబెట్టి, “ఎవరు ఫిట్?” అని అడిగితే, చాలామంది అమ్మలు రోహిత్ వైపు వేలు చూపిస్తారు. ఎందుకంటే, మనకు ఫిట్నెస్ అంటే పొట్ట కనిపించకపోవడమే! కానీ, నిజమైన ఆరోగ్యం అంత సులభం కాదు.కేలరీల లెక్కలు ఒక్క పూరీ కథమీకు తెలుసా? ఒక్క పెద్ద సైజు పూరీలో 140–150 కేలరీలు ఉంటాయి. దాన్ని కరిగించడానికి 5–6 కిలోమీటర్లు నడవాలి! కానీ, మనం ఉదయం ప్లేటులో నాలుగు పూరీలు, రెండు వడలు, రెండు బోండాలు “బ్రేవ్”గా మింగేస్తాం. మధ్యాహ్నం రెండు కుండల అన్నం, సాయంత్రం బజ్జీలు, పునుగులు, రాత్రికి మళ్లీ ఒకటిన్నర కుండ అన్నం ఇది మన రోజూ కోటా!వారానికోసారి బిర్యానీ స్వాహా చేయడం మర్చిపోలేం కదా? ఒక బిర్యానీలో 2000 కేలరీలు, 250 ఎంఎల్ కూల్ డ్రింక్లిపితే 200 కేలరీలు, పెద్ద సైజు బాటిల్ అయితే 500 కేలరీలు! ఒక్క పూరీ కరిగించడానికే 6 కిలోమీటర్లు నడవాలంటే, బిర్యానీ కోసం పాదయాత్ర చేయాలా? అది మన జీవితంలో జరిగే పనేనా?పొట్ట యాదగిరిగుట్ట కాదు!ఈ కేలరీల రాశి కడుపులోకి టపటపా పోతూనే ఉంటుంది. అలాంటప్పుడు పొట్ట యాదగిరిగుట్టలా ఎందుకు మారదు? “ఒక్క పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి” అని సామెత. ఇది సామెత కాదు, స్వచ్ఛమైన సత్యం.బేరం ఆడుదాం రెండు పూటలే చాలుఅందుకే, రోగిష్టీ 3 పూటలు కాదు, యోగి 1 పూట కాదు మధ్యమార్గంగా రెండు పూటలకు వచ్చేసి బేరం కొట్టేద్దాం. నేను రెండు పూటలే తింటాను. ఉదయం టిఫిన్ మానేసి, రెండు గ్లాసుల రాగి జావ తాగుతా. అన్నం మాని రెండేళ్లు!ఆరోగ్యం అసలైన సంపదప్రతి తత్త్వం మన ముక్కు పగిలిన తర్వాతే బోధపడాల్సిన పనిలేదు. పక్కనోడి ముక్కుపై ప్లాస్టర్ చూసి కూడా జాగ్రత్త పడొచ్చు. జీవితంలో డబ్బు, కీర్తి కోల్పోయినా తిరిగి సంపాదించొచ్చు. కానీ, ఆరోగ్యం కోల్పోతే? అది అంత సులభం కాదు.పిల్లలకు నేర్పండి తిండి అనేది రుచికోసం కాదు, ఆరోగ్యం కోసం. మితంగా తినండి, ఆరోగ్యంగా జీవించండి…!!
బ్యాడ్ హ్యాబిట్ – 2
అతి జాగ్రత్తతో ఎదవలను తయారు చేయకు98% తల్లిదండ్రుల ఆలోచన ఒక్కటే: “నేను జీవితంలో పడ్డ కష్టం, నా పిల్లలు పడకూడదు.” కానీ, ఈ ఆలోచనలోనే అతిపెద్ద లోపం దాగి ఉంది.నాకు తెలిసిన ఒక తండ్రి తన కొడుకుని దుకాణానికి కూడా పంపేవాడు కాదు. ఎందుకని అడిగితే, “రోడ్డు మీద బండ్లు తిరుగుతాయి, జాగ్రత్త” అన్నాడు. ఫలితం? ఆ పిల్లవాడు సైకిల్ తొక్కడం కూడా నేర్చుకోలేని స్థితికి చేరాడు.పిల్లవాడు చీకట్లో అడుగు పెట్టాల్సి వస్తే, చేతిలో దీపం పట్టించి పంపాలి. కానీ, “రాత్రి” అని భయపెట్టి, జీవితాంతం చీకటి నుండి పారిపోయేలా చేయకూడదు.నీవు ఈ రోజు మానసికంగా బలంగా ఉన్నావంటే, అది నీవు అనుభవించిన కష్టాల వల్లే. మరి, నీ పిల్లలు కూడా బలంగా ఎదగాలంటే, వాళ్లు కూడా కొంత కష్టాన్ని రుచి చూడాలి కదా? ఇంత సింపుల్ లాజిక్‌ని ఎలా మిస్ అవుతున్నావు?చెమట చిందించినప్పుడే కండలు బిగుస్తాయి. లేకపోతే, ఒళ్లు ఉలవల బస్తా లాంటిదైపోతుంది. పిల్లల జీవితం కూడా ఇలాంటిదే. సున్నితంగా, సుకుమారంగా పెంచి, ఏడు తరాలకు సరిపడా సంపద ఇచ్చినా, ఆ పిల్లవాడు బురదలో బర్రెలా ఊరడం తప్ప ఏమీ చేయలేడు.పండితుడి కొడుకు శుంఠగా తయారవడానికి కారణం ఇదే! అతి జాగ్రత్తతో పెంచడం వల్ల వాళ్లు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోలేరు.అడవిలో ఉన్న సింహం, బోనులో ఉన్న సింహం ఎప్పటికీ ఒకటి కాదు. ఒకటి విసిరిన ముక్కలు ఏరుకుని తింటుంది. మరొకటి పంజా విసిరి, వేటాడి తింటుంది. రెండూ ఒకటి కాదు.అందుకే, పిల్లలను అతి జాగ్రత్తగా పెంచకు. కష్టం, సవాళ్ల ద్వారా వాళ్లని బలంగా, స్వతంత్రంగా తీర్చిదిద్దు. లేకపోతే, ఎందుకూ పనికిరాని ఎదవలను తయారు చేసినవాడవవుతావు.