తమిళంలో దర్శకుడిగా వెట్రి మారన్ కి మంచి పేరు ఉంది. అలాంటి ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమానే ‘బ్యాడ్ గర్ల్’. వెట్రి మారన్ దర్శకత్వ శాఖలో పనిచేసిన ‘వర్ష భరత్’ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. టీజర్ రిలీజ్ తరువాత విమర్శలను .. వివాదాలను ఎదుర్కున్న సినిమా ఇది. సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి ‘జియో హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
కథ: రమ్య (అంజలి శివరామన్) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. స్కూల్ ఫైనల్ చదువుతూ ఉంటుంది. ఆచార సంప్రదాయాలను పాటించే కుటుంబంలో ఆమె పెరుగుతుంది. వేరే ఊళ్లో జాబ్ చేస్తూ తండ్రి దూరంగా ఉంటాడు. రమ్య చదువుకుంటున్న స్కూల్ లోనే ఆమె తల్లి సుందరి (శాంతిప్రియ) టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక వైపున నాయనమ్మ .. మరో వైపున తల్లి పద్ధతుల పట్ల రమ్య అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. పద్ధతుల పంజరంలో తనని ఉంచినట్టుగా ఆమె భావిస్తూ ఉంటుంది.
నలన్ ఆ స్కూల్లో కొత్తగా జాయిన్ అవుతాడు. అతని పట్ల రమ్య ఆకర్షితురాలు అవుతుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ఊరు నుంచి వెళ్లిపోదామని ఇద్దరూ ప్లాన్ చేస్తారు. అయితే చివరి నిమిషంలో ఆ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. నలన్ ను అతని ఫ్యామిలీ సింగపూర్ పంపించేస్తారు. ఈ విషయం తెలిసి రమ్య చాలా బాధపడుతుంది. మరుసటి ఏడాదిలో ఆమెను రెసిడెన్షియల్ కాలేజ్ లో చేరుస్తారు.
ఇంటికి దూరంగా ఉండే ఛాన్స్ వచ్చినందుకు రమ్య చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కాలేజ్ లో ఆమెకి అర్జున్ పరిచయమవుతాడు. అర్జున్ పట్ల ఆమెకి గల ఆకర్షణ ప్రేమగా మారుతుంది. అయితే అర్జున్ తనని మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదని తెలిసి షాక్ అవుతుంది. ఈ విషయంలో అతణ్ణి అందరి ముందే నిలదీస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ.
విశ్లేషణ: పిల్లల చిన్నప్పుడు పేరెంట్స్ మాట వింటారు .. కొంత పరిపక్వత వచ్చిన తరువాత, పేరెంట్స్ ఎందుకు చెప్పారనేది ఆలోచన చేస్తారు. అయితే ఈ మధ్యలో వాళ్లు తమ పేరెంట్స్ మాట వినని దశ ఒకటి ఉంది .. అదే టీనేజ్. పిల్లలు హై స్కూల్ చదువును పూర్తి చేసుకుని .. కాలేజ్ లో అడుగుపెట్టే ఈ దశలో తల్లిదండ్రులు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఎందుకంటే కొంతమంది పిల్లల అభిప్రాయాలు, ఈ దశలో తల్లిదండ్రుల ఆలోచనలకు పూర్తి భిన్నంగా మారిపోతూ ఉంటాయి.
అలాంటి ఒక దశలో ఉన్న ‘రమ్య’ అనే అమ్మాయి.. ఆమెను నియంత్రించలేక అవస్థలు పడే సుందరి అనే తల్లి కథ ఇది. ఈ అంశాన్నే దర్శకురాలు ఈ కథగా మలచుకోవడం జరిగింది. ఈ సినిమాకి ‘బ్యాడ్ గర్ల్’ అనే టైటిల్ పెట్టడం వలన, ఆ పాత్రను గురించి మాట్లాడానికి ఏమీ లేదు. అందుకు తగినట్టుగానే ఆ పాత్రను మలిచారు. ఇది టీనేజ్ లవ్ స్టోరీ కాదు .. పరిపక్వత కలిగిన ప్రేమకథ కూడా కాదు.
ఆచార సంప్రదాయాలకు విలువనిచ్చే ఒక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, తన ఇష్టానికి బాయ్ ఫ్రెండ్స్ ను .. లవర్స్ ను మారుస్తూ వెళుతుంటుంది. ‘నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు ఇలా చేస్తున్నాను’ అనుకుంటూనే చేయవలసింది చేసేస్తూ ఉంటుంది. ‘మీరే నా జీవితాన్ని నాశనం చేశారు’ అంటూ తల్లినే క్లాస్ పీకుతూ ఉంటుంది. చివరి వరకూ తనదే కరెక్టు అనుకునే ఇలాంటి ఒక పాత్ర ద్వారా, ఏ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారనేది ఒక ప్రశ్నార్థకమ్.
పనితీరు: వర్ష భరత్ కి దర్శకురాలిగా ఇది తొలి సినిమా. తనకి తోచినట్టుగా నడుచుకునే ఒక ‘బ్యాడ్ గర్ల్’ కథ ఇది. ఈ కథలో ఎలాంటి మలుపులుగానీ .. ఎమోషన్స్ గాని కనిపించవు. ముగింపు కూడా ప్రేక్షకులు ఆశించినట్టుగా ఉండదు. కథకి తగినట్టుగా .. టైటిల్ కి తగినట్టుగా ఒకటి రెండు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి.
నటీనటుల నటన గురించి చెప్పుకునే స్థాయిలో పాత్రలు గానీ .. సన్నివేశాలు గానీ లేవు. ప్రీత జయరామన్ ఫొటోగ్రఫీ .. అమిత్ త్రివేది నేపథ్య సంగీతం .. రాధ శ్రీధర్ ఎడిటింగ్ ఫరవాలేదు.
రేటింగ్ 2.5/5


















