దేశంలోనే సంచలనంగా మారిన కేసుల్లో ఒకటైన ఆయేషా మీరా హత్యాచారం కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. 18 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సాగుతూనే ఉంది. ఆ బాధితురాలి తల్లిదండ్రులు ఇంకా న్యాయాన్ని కోరి ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా, సీబీఐ ఈ కేసుపై తన తుది నివేదికను సీల్డ్ కవర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించింది. దీంతో ఈ కేసు మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఘటన ఎలా జరిగింది?
2007 డిసెంబర్ 27న ఈ దారుణ ఘటన జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్‌లో బీ.ఫార్మసీ చదువుతున్న 17 ఏళ్ల ఆయేషా మీరా అత్యాచారం, హత్యకు గురైంది. ఈ సంఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మొదటి దశ విచారణ
2008లో పిడతల సత్యం బాబును పోలీసులు అరెస్టు చేశారు. 2010లో విజయవాడ మహిళా కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, 2017లో హైకోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో దర్యాప్తులో ఘోరమైన లోపాలు ఉన్నాయని తీవ్రంగా మండిపడింది.
కేసు తిరిగి ఓపెన్
ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిపై 2018లో హైకోర్టు కేసును తిరిగి ఓపెన్ చేసి సీబీఐకి అప్పగించింది. కానీ కేసు రికార్డులు నాశనం చేయబడిన విషయం 2014లో వెలుగులోకి రావడం మరో ఆశ్చర్యకర విషయమైంది. దీనిపై కూడా కోర్టు కేసు నమోదు చేయమని ఆదేశించింది.
సీబీఐ దర్యాప్తు
2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. 2020లో ఫోరెన్సిక్ నిపుణులు ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను సీబీఐ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించింది. 2023లో సీబీఐ కీలకంగా పుసపటి కృష్ణ ప్రసాద్, నందిగామ మాజీ డీఎస్పీ శ్రీనివాసులను విచారించింది.
తుది నివేదిక.. కోర్టులో విచారణ జూన్ 26కి వాయిదా
తాజాగా సీబీఐ తన తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 26కి వాయిదా వేసింది. ఈ రిపోర్టులో ఏముంది? ఎవరు నేరస్థులని గుర్తించారు? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది.
తల్లిదండ్రుల ఆవేదన
“18 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. మా కుమార్తెకు న్యాయం జరగాలి. ఆమెను ఎవరు హత్య చేశారో తేల్చాలి. నేరస్తులు శిక్షపడాలి” అని ఆయేషా మీరా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.