ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పేరుగాంచిన భారత్.. ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆయుధాలను తయారు చేసి ఎగుమతి చేసే దేశంగా చరిత్ర సృష్టించింది. “ఆత్మనిర్భర్ భారత్” విజన్‌కు తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తూ, దేశ రక్షణ ఎగుమతులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగి ₹23,622 కోట్లకు చేరాయి.
ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఘనత గత ఏడాదితో పోలిస్తే 12% వృద్ధిని సూచిస్తుంది. ఇంకా కీలక విషయం ఏమిటంటే, 2013–14లో ఉన్న కేవలం ₹686 కోట్ల ఎగుమతులతో పోలిస్తే, ప్రస్తుత గణాంకాలు ఏకంగా 34 రెట్లు పెరుగుదలను చూపడం భారత రక్షణ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పును తెలియజేస్తుంది.గత దశాబ్దంలో విదేశీ కంపెనీలపై ఆధారపడి ఆయుధాలు కొనుగోలు చేసిన స్థితి నుంచి స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ఆయుధాలను ప్రపంచ దేశాలకు విక్రయించే స్థాయికి భారత్ చేరుకుంది.
ఈ పరివర్తన సాధ్యం కావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన చర్యలే కీలకం. దేశీయ రక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం. డిఫెన్స్ ప్రొడక్షన్ & ఎగుమతి ప్రోత్సాహక విధానం (DPEPP)లో రక్షణ ఉత్పత్తి, ఎగుమతులను ప్రోత్సహించడం. సరళీకృత ఎగుమతి లైసెన్స్ విధానం ద్వారా ఎగుమతి ప్రక్రియను సులభతరం చేయడం. మేక్ ఇన్ ఇండియా , iDEX (Innovate for Defence Excellence) వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు, MSME లకు మద్దతు ఇవ్వడం.
భారత్ ఎగుమతి విజయాలలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. భారత్–రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి, తన అత్యంత వేగం, ఖచ్చితత్వం, విశ్వసనీయతతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిలిప్పైన్స్ భారత్ నుండి బ్రహ్మోస్ కొనుగోలు చేసిన తొలి దేశంగా నిలిచింది. మరిన్ని దేశాలు కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నాయి.
ప్రస్తుతం భారత్ 85కి పైగా దేశాలకు రక్షణ సామగ్రిని ఎగుమతి చేస్తోంది. ఇది భారత సాంకేతిక నైపుణ్యం, నమ్మకానికి బలమైన నిదర్శనం. DRDO, HAL, BDL, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ & టీ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ విజయానికి మూల స్తంభాలుగా నిలిచాయి.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నట్లుగా “భారత్ ఇక ఆయుధాలు కొనుగోలు చేసే దేశం కాదు.. ప్రపంచ స్థాయి ఆయుధాలను తయారు చేసి ఎగుమతి చేసే దేశం.” ఈ స్ఫూర్తితో 2028–29 నాటికి రక్షణ ఎగుమతులను ₹50,000 కోట్లకు పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.
భారత్ ప్రస్తుతం AI ఆధారిత రక్షణ సాంకేతికత, డ్రోన్లు, స్పేస్ డిఫెన్స్ ప్లాట్‌ఫార్మ్స్ వంటి ఆధునిక రంగాలలో వేగంగా పురోగమిస్తోంది. ఈ పురోగతితో రాబోయే సంవత్సరాలలో ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.దిగుమతి చేసుకునే భారత్ నుండి ఎగుమతి చేసే భారత్ దిశగా ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు కేవలం ఆలోచన కాదు, కార్యరూపం దాల్చిన వాస్తవం!


















