మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం
మహాసభలకు, బిజినెస్ సెమినార్‌కు హాజరుకావాలని కోరిన ఆటా ప్రతినిధులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు–యువజన సదస్సు అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ ఈశ్వర్ బండా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా, డిసెంబర్ 19న హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్‌కు కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ సమావేశంలో అమెరికా-తెలంగాణ మధ్య వ్యాపార, సాంకేతిక, స్టార్టప్ రంగాల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఆటా చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.
ATA మహాసభల్లో అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజం, వ్యాపారవేత్తలు, యువ ఇన్నోవేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో సాంస్కృతిక వేడుకలు, యూత్ కాన్ఫరెన్స్లు, బిజినెస్ కాన్ఫరెన్సులు, NRI సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మంత్రికి వివరించారు.


















