వైసీపీలో అపుడే తొందర ఎక్కువ అవుతోంది. అది కూడా బహుదూరంగా ఉన్న సార్వత్రిక ఎన్నికలకు. 2029లో షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇంతలోనే కర్చీఫులు కండువాలు పరచేస్తున్నారు వైసీపీ నేతలు. మరో నాలుగేళ్ళ వ్యవధిలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆరాటాలకు పోరాటాలకు తెర తీస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అందులో వైసీపీలో అధినాయకత్వానికి సన్నిహితులు కూడా చాలా మంది ఉన్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే కడప జిల్లాలో కడప ఎమ్మెల్యే సీటు రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంటూ వస్తోంది ఈ సీటుని చాలా ఎన్నికల తరువాత 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది. మాధవీ రెడ్డి అలా ఎమ్మెల్యే అయ్యారు. ఆమె ఓడించింది కూడా ఆషామాషీ వ్యక్తిని కాదు జగన్ కి అత్యంత సన్నిహితుడు, మైనారిటీలలో పలుకుబడి ఉన్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాను. ఆయన 2014లో కూడా గెలీచారు 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ళ పాటు డిప్యూటీ సీఎం గా పనిచేశారు. అయితే కూటమి ప్రభంజనంలో ఓడారు. ఇపుడు ఆ సీటు విషయంలో వైసీపీలో ఫైట్ స్టార్ట్ అయిందా అన్న ప్రచారం సాగుతోంది.
జగన్ సొంత మేనమామ అయిన రవీంద్రనాధ్ రెడ్డి కడప అసెంబ్లీ సీటు కోరుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన వైఎస్సార్ సీఎం గా ఉండగా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పట్లో ఆయన కడప కార్పోరేషన్ కి మేయర్ గా పనిచేసి కడప నగరంలో పట్టు సాధించారు. ఇక ఆయన వైసీపీలోకి వచ్చాక కడప సీటే కోరారని అంటారు కానీ ఆ సీటుని మైనారిటీలకు కేటాయిస్తూ వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. అలా అంజాద్ భాషాకు చాన్స్ దక్కింది గత మూడు సార్లు ఆయనకే టికెట్ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడం మైనారిటీలు కాకుండా రెడ్ల నుంచి గెలవడంతో ఈసారి వైసీపీ కూడా వ్యూహాలు మారుస్తుంది అని అంటున్నారు. దాంతో రవీంద్రనాథ్ రెడ్డి కన్ను ఆ వైపు ఉంది అని చెబుతున్నారు.
ఇక 2014, 2019లలో రెండు సార్లు కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రారెడ్డి ఆ సీటుని తన కుమారుడికి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే అక్కడ ఇంచార్జిగా ఆయన కుమారుడు ఉన్నారు. దాంతో ఆయన తన కోసం కడప సీటు అడుగుతున్నారని టాక్ నడుస్తోంది వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన తన సీటుని ముందే చూసుకుంటున్నారు అని అంటున్నారు.
ఒక చూస్తే కడపలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి జగన్ ఒక దాంట్లో పోటీ చేస్తారు. మేనమామ కుటుంబానికి ఒక సీటు ఇస్తారు కానీ రెండు అంటే ఇస్తారా అన్న చర్చ కూడా ఉందిట. అలా ఇస్తే మిగిలిన చోట్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అయితే తన చిరకాల కోరికగా కడప నుంచి పోటీ చేయాలని భావించి రవీంద్రనాధ్ రెడ్డి దానికి తగిన విధంగా ప్లాన్ వేసుకుంటున్నారు అని అంటున్నారు. అయినా మరో నాలుగేళ్ల నాటి ముచ్చట కదా అని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది.