సెప్టెంబరు 28..! పాకిస్థాన్ ను చిత్తు చేసి టీమ్ ఇండియా ఆసియా కప్ ను నెగ్గిన రోజు. కానీ, ఇంతవరకు మన జట్టు చేతికి ఆ ట్రోఫీ అందలేదు. అసలు ఎక్కడున్నదీ కూడా తెలియడం లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) కార్యాలయంలో ఉన్నదని నిన్నమొన్నటిదాక భావించారు. అక్కడినుంచి కూడా గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారని అంటున్నారు. అసలు కప్ ను ఎత్తుకెళ్లిన దొంగ ఏసీఏ చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ నఖ్వీ. పెహల్గాంలో అమాయక పర్యటకులపై పాకిస్థాన్ మద్దతుతో ఏప్రిల్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా.. సెప్టెంబరు 28న టీమ్ ఇండియా.. ఏసీఏ చైర్మన్ అయినప్పటికీ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. వాస్తవానికి మన జట్టు మంచి పనే చేసింది.
పెహల్గాం ఆగ్రహ జ్వాలలు రగులుతుండడంతో.. ఆసియా కప్ లో మూడుసార్లు తలపడినా పాక్ ఆటగాళ్లతో మనవాళ్లు షేక్ హ్యాండ్ లు ఇవ్వలేదు. ఇక ఫైనల్లో నఖ్వీ నుంచి కప్ అందుకుంటే అంతకంటే దారుణం అని భావించింది. పాక్ జాతీయ ప్రభుత్వంలో అతడు మంత్రి కూడా. ఇక ఆసియా కప్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు చేసిన తుపాకీ సంకేతాలకు మద్దతు పలికాడు. పేసర్ హారిస్ రవూఫ్ పై విధించిన 30శాతం మ్యాచ్ ఫీజును తన సొంత డబ్బు నుంచి కడతానని అన్నాడు. అలాంటివాడు అందించే కప్ ను తీసుకోవద్దని ఫైనల్ మ్యాచ్ ముగిశాక టీమ్ ఇండియా నిర్ణయించింది.
టీమ్ ఇండియా ఇచ్చిన షాక్ తో దిమ్మ తిరిగిన నఖ్వీ ఆసియా కప్ ను దుబాయ్ స్టేడియం నుంచి తనతోపాటు తీసుకెళ్లాడు. ఆ తర్వాత హోటల్ రూమ్ లో పెట్టుకున్నాడు. ఇది జరిగి నెల దాటింది. కొన్ని రోజుల కిందట మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలోకి మార్చినట్లు కథనాలు వచ్చాయి. తన అనుమతి లేకుండా ఎవరికీ కప్ ను తీసుకునే అవకాశం ఇవ్వొద్దని ఏసీఏ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు నఖ్వీ. ఇక ఆసియా కప్ ముగిసిన సెప్టెంబరు 28 తర్వాత రెండురోజులకు ఏసీఏ సమావేశానికి నఖ్వీ వర్చువల్ గా హాజరయ్యాడు. ఆ సమయంలో ట్రోఫీపై బీసీసీఐ నిలదీసింది.
తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేసింది. కానీ, నఖ్వీ ఇప్పటికీ ఆ పనిచేయలేదు. టీమ్ ఇండియా కెప్టెన్, బీసీసీఐ ప్రతినిధి వచ్చి తన నుంచి తీసుకెళ్లాలని సూచించాడు. దీనికి బీసీసీఐ ససేమిరా అనడంతో కప్ కథ కంచికి చేరలేదు. ఇక నఖ్వీకి పదిరోజుల కిందట బీసీసీఐ మెయిల్ పెట్టింది. ఆసియా కప్ అప్పగించకుంటే నవంబరులో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో తేల్చుకుంటామని హెచ్చరించింది. అదే జరిగితే ఏసీఏ చైర్మన్ గా నఖ్వీకి ఉద్వాసన తప్పదు.
ఈ నెల తొలివారంలోనే ఐసీసీ సర్వసభ్య సమావేశం ఉంది. బహుశా 4వ తేదీన ఉంటుందని భావిస్తున్నారు. అసలే ఐసీసీ చైర్మన్ గా భారతీయుడైన జై షా ఉన్నారు. ఈనేపథ్యంలో నఖ్వీ భయపడినట్లున్నాడు. అతడు ఒకటి, రెండు రోజుల్లో ఆసియా కప్ ను భారత్ కు ఇస్తాడని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆసియా కప్ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.


















