ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రుషికొండ ప్యాలెస్‌పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాన్ని మానసిక వైద్యశాలగా మార్చాలని ఆయన సలహా ఇచ్చారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో విశాఖలో ఆయనకు ఏర్పాటు చేసిన సన్మాన సభలో అశోక్‌గజపతిరాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అశోక్ గజపతిరాజు, ఆ భవనానికి సంబంధించిన గోడల పెచ్చులు ఊడిపోయినట్లు తాను విన్నానని పేర్కొన్నారు. “అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భవనాన్ని ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోందని, అయితే దానిని పిచ్చి ఆసుపత్రిగా మారిస్తే మంచిదని తన ఉచిత సలహా అని చెప్పుకొచ్చారు. “అలా అయితే కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు” అని అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాధనాన్ని ప్రజా హితం కోసమే వాడాలని ఆయన పునరుద్ఘాటించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలని ఆయన సూచించారు. నిరుపయోగంగా ఉన్న రుషికొండ భవనాన్ని ఏం చేస్తే బాగుంటుందో ప్రజలే తమ అభిప్రాయాలను చెప్పాలని ఆయన కోరారు.
గోవా గవర్నర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజును విశాఖపట్నంలో క్షత్రియ సేవా సమితి ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.