AP: సంక్రాంతి కానుక.. పెండింగ్ బిల్లులు క్లియర్
అమరావతి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్‌తో పాటు ఇతర బిల్లులను క్లియర్ చేస్తూ భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.2,653 కోట్ల మేర నిధులను మంజూరు చేయడం ద్వారా ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ఊరట కలిగించింది.
పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపుల కోసం రూ.1,100 కోట్లను విడుదల చేసింది. అలాగే పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్ బిల్లుల కోసం రూ.110 కోట్లను మంజూరు చేసింది. ఇక వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఎఎఫ్ ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ.1,243 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
ఈ నిర్ణయంతో సంక్రాంతి పండుగకు ముందు ఉద్యోగుల చేతికి నగదు అందనుండగా, కాంట్రాక్టర్లకు కూడా ఆర్థికంగా ఊరట లభించనుంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడానికి ఈ నిధుల విడుదల దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పెండింగ్ బిల్లుల సమస్యను దశలవారీగా పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి.
ap









