చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసిన పేరే. ఆయన రాజకీయం కూడా జన పరిచితమే. ఆయనది దాదాపుగా యాభై ఏళ్ల రాజకీయ జీవితం. కాంగ్రెస్ లో పుట్టి అందులోనే మంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాజకీయ పరమ పద సోపానంలో అతి కీలకమైన సింహాసనాన్ని చిన్న వయసులోనే అందుకున్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా అయిన పుష్కర కాలంలోనే ఉమ్మడి ఏపీకి తిరుగులేని అధికారంతో సీఎం అయ్యారు. ఇదంతా జరిగింది మూడు దశాబ్దాల క్రితం.
ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో మరచిపోలేని పేజీ ఏమిటి అంటే చంద్రబాబు తొలిసారి సీఎం కావడం. అప్పట్లో రాజకీయ సంక్షోభం పెద్ద ఎత్తున సాగింది. జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం అయింది. దిగ్గజ నాయకుడు ప్రజాకర్షణలో ఎదురులేని నేతగా ఉన్న ఎన్టీఆర్ స్థానంలో ముఖ్యమంత్రి కావడం అందునా టీడీపీలో ఆయన చెయిర్ లో కూర్చోవడం అంటే ఎవరూ ఊహించనిది. ఒక విధంగా చెప్పాలంటే రేర్ ఫీట్. నెవెర్ బిఫోర్ నెఫెర్ ఆఫ్టర్ అని కూడా అనుకోవచ్చు. అలాంటిది 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఉమ్మడి ఏపీకి అప్పటి దాకా చూస్తే ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరూ లేరు. అలాంటిది చంద్రబాబు 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన సీఎం అయ్యాక తనలోని డైనమిక్ లీడర్ ని బయటకు తీశారు. అసలైన చంద్రబాబు ఏమిటి ఆయన చాణక్య రాజకీయం ఎలా ఉంటుందో నాటి నుంచే ఏపీ జనాలు కానీ భారత దేశం కానీ కళ్ళారా చూసింది అన్నది వాస్తవం.
ఇక చంద్రబాబు ఎన్టీఆర్ స్థానంలో సీఎం అయి ఇంకా కుదురుకోకుండానే 1996లో దేశంలో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే బాబు సత్తా తెలుస్తుంది అని అంతా అనుకున్నారు. ఆ ఎన్నికల నాటికి ఎన్టీఆర్ దివంగతులు అయ్యారు. కానీ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీతో పోటీ ఇచ్చారు. అలా టీడీపీ ఓటు చీలిపోతుందని కాంగ్రెస్ గెలుస్తుందని అంచనాలు ఉన్న చోట. మొత్తం ఉమ్మడి ఏపీలో 42 ఎంపీ సీట్లకు గానీ 28 దాకా గెలుచుకుని టీడీపీని విజయపథాన బాబు నడిపించారు. అలా ఉమ్మడి ఏపీలో తన నాయకత్వానికి తిరుగులేదని చాటారు.
ఇక ఆ సమయంలో జాతీయ స్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి ఉంది. దాంతో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మద్దతుతో థర్డ్ ఫ్రంట్ ని అధికారంలోకి తెచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారు. దానిని యునైటెడ్ ఫ్రంట్ అని పేరు పెట్టారు. చంద్రబాబునాయుడు కన్వీనర్ గా కూడా దానికి వ్యవహరించారు. అలా రెండేళ్ల పాటు యునైటెడ్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలో ఉంది. జాతీయ రాజకీయాలో ఆనాటి నుంచి మొదలైన చంద్రబాబు హవా ఈ రోజుకీ కొనసాగుతూండడం విశేషం.
ఆ సమయంలో చంద్రబాబు సీఎం అవుతారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన సీఎం అయ్యారు. ఆ ముహూర్త బలం ఏమిటో కానీ మరోసారి కూడా 1999లో గెలిచారు. అలా తొమ్మిదేళ్ళ పాటు ఏకధాటిగా ఉమ్మడి ఏపీని ఏలారు. ఇక విభజన ఏపీలో కూడా మరో రెండు సార్లు చంద్రబాబు గెలిచారు. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు సార్లు సీఎం అయిన ఘనతను ఆయన సాధించారు. ఇప్పటప్పట్లో ఎవరికీ ఆ రికార్డు ఎవరికీ దక్కనంత ఎత్తున బాబు ఉన్నారు. మొత్తానికి సెప్టెంబర్ 1 1995 నుంచి సెప్టెంబర్ 1 2025 అంటే ఈ మధ్యన ముప్పయ్యేళ్ళూ తెలుగు నాట బాబు శకంగా చెప్పవచ్చు అన్నది అంతా ఒప్పుకునే నిజం.