ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) సిట్ అధికారులు (SIT Officers) మెమో వేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను చేర్చారు సిట్ అధికారులు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో పేర్కొన్నారు నిందితులు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని నిన్న (సోమవారం) సుప్రీం కోర్టుకు ఈ ముగ్గురు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే వీరికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే ఈ కేసును చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది రెండు రోజుల క్రితం కోరారు.
అప్పటి వరకు కూడా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఈ ముగ్గురు హైకోర్టును అభ్యర్థించారు. కానీ హైకోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ముగ్గురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వీరికి నిరాశే ఎదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో పాటు ఈ కేసులో జోక్యం చేసుకుందు కూడా నిరాకరించింది సుప్రీం ధర్మాసనం. దీంతో ఈ ముగ్గురు పేర్లను ఈ కేసులో చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. కోర్టు ఈ మెమోను పరిగణలోకి తీసుకుంటే ఈ ముగ్గురిని ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులుగా చేర్చినట్టు అవుతుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ మద్యం వ్యాపార లావాదేవీల్లో దాదాపు రూ.2600 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందన్న అభియోగంపై కేసు నమోదు కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలోని కీలక నేతలు, వ్యక్తులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు నిందితులుగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన నిందితుడు ఏ1 రాజ్ కెసిరెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ వైసీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తదితర ప్రముఖులను సహ నిందితులుగా పేర్కొన్న సిట్ అధికారులు తాజాగా, నాటి సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ మేరకు సిట్ అధికారులు నిన్న విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.
తాజా పేర్ల నమోదుతో నిందితుల సంఖ్య 33కి చేరింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ.. కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ప్రమేయం గురించి సిట్ స్పష్టంగా వెల్లడించింది. ఈ ముగ్గురు సాక్ష్యులను, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వారిని సిట్ నిందితులుగా చేర్చింది