మద్యం ధరలను పెంచిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను స్వల్పంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ బాటిల్‌పై ఇప్పటికే రూ.99 ధర ఉన్న బ్రాండ్లను మినహాయించి, మిగిలిన అన్ని రకాల మద్యం బ్రాండ్లపై రూ.10 చొప్పున ధర పెంపును అమలు చేసింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.
అయితే సామాన్య వినియోగదారులకు కొంత ఊరటగా బీరు, వైన్, రెడీ టు డ్రింక్ (RTD) ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడమే ఈ ధరల సవరణ వెనుక ప్రధాన ఉద్దేశమని సమాచారం.
ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుందని, అదే సమయంలో తక్కువ ధర మద్యం వినియోగించే వారిపై పెద్ద భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇక మద్యం ధరల పెంపుపై వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
APLiquorPrices








