ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు పలు శాఖల్లో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, ముఖ్య విభాగాల్లో డైరెక్టర్లు, కమిషనర్లు, సీఈఓలు, ఎంఢీలు నియమించబడ్డారు.
కాగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మల్లారపు నవీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మొగిలి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. వీరిద్దరికి జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు అప్పగించబడ్డాయి.
కార్పొరేషన్లు, సంస్థల్లో పోస్టింగ్‌లు..
ఎస్. నాగలక్ష్మి – ఏపీజెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్
కట్టా సింహాచలం – రాష్ట్ర ఖాదీ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
అమిలినేని భార్గవ్ తేజ – పట్టణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్
ఇవీ ముఖ్యమైన శాఖల్లో ఆర్థిక, పరిపాలన, అభివృద్ధి అంశాలకు కీలకమైన పదవులుగా భావిస్తున్నారు.
అంబేడ్కర్ – స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్
చామకూరి శ్రీధర్ – ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్
పీ. ప్రశాంతి – రీహాబిలిటేషన్ & రీసెటిల్‌మెంట్ డైరెక్టర్
ఎ. మల్లికార్జున – రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి
ప్రభుత్వం వీరిని సంబంధిత విభాగాల్లో పరిపాలనా పనితీరును బలోపేతం చేయడానికి ఎంపిక చేసింది.
త్వరలో మరిన్ని ఉత్తర్వులు..
ప్రస్తుతం ఈ పోస్టింగ్‌లలో పనిచేస్తున్న అధికారులు కొత్తగా ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనే దానిపై త్వరలో ప్రత్యేక ఉత్తర్వులు వెలువడనున్నాయని ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. ఈ బదిలీలు, పోస్టింగ్‌లు రాష్ట్ర పరిపాలనలో సమతుల్యం, వేగం, సమర్థత తీసుకురావడమే లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాబోయే నెలల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా కీలక విభాగాల్లో అనుభవజ్ఞులైన అధికారుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టిందని భావిస్తున్నారు.