ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వంలో అధికారం చేపట్టి ఏణ్ణర్ధం మాత్రమే అయింది. ఇంకా మూడున్నరేళ్ళ పాటు పవర్ చేతిలో ఉంది. అయితే కూటమికి భారీ మెజారిటీని 2024 ఎన్నికల్లో ప్రజలు కట్టబెట్టారు. అంతే కాదు 94 స్ట్రైక్ రేటు తో కూటమి ఏపీలో అధికారం అందుకుంది. దాంతో పాటుగా వైసీపీకి దారుణమైన ఫలితాలు దక్కాయి. కేవలం పదకొండు సీట్లు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో ఏపీ పునర్నిర్మాణం అని కూటమి పెద్దలు చెబుతున్నారు ప్రజలలోకి దానినే బలంగా తీసుకుని వెళ్తున్నారు. విభజనతో పాటు అయిదేళ్ల వైసీపీ పాలనతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని ఈ నష్టాన్ని పూడ్చాలి అంటే కనుక కచ్చితంగా మరో మూడు టెర్ములు అధికారంలో కూటమి ఉంటేనే తప్ప ఏపీ బాగుపడదని జనంలో ఒక బిగ్ డిస్కషన్ ని ఉంచి మరీ ఎప్పటికపుడు వారిని చైతన్యం చేస్తున్నారు.
రాజకీయాలు వైకుంఠపాళి కాదని ఏపీలో అయితే అలాంటి తప్పులు చేయవద్దని చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి హోదాలో అనేక సభలలో చెబుతూ వస్తున్నారు ఒకసారి ఒకరికి మరోసారి ఇంకొకరికి అధికారం ఇస్తే ఏపీ అభివృద్ధి సాగదని కూడా అంటున్నారు. నిరాటంకంగా ఒకరికే పవర్ అందిస్తే కనుక ప్రగతి బాటలో ఏపీకి తిరుగు ఉండదని ఆయన చెబుతున్నారు. అందుకే ప్రజలు బాగా ఆలోచించి వ్యవహరించాలని ఇప్పటి నుంచే గట్టిగా చెబుతున్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండాలని గట్టిగా కోరుతున్నారు. ఆయన ఏ సభలో అయినా ఇదే మాట వినిపిస్తున్నారు ఇదంతా ఏపీ అభివృద్ధి కోసమే అని చెబుతున్నారు. కూటమి బలంగా స్థిరంగా ఉంటేనే ఏపీ దేశంలో అగ్ర స్థానంలోకి వెళ్తుందని ఆయన చెబుతున్నారు. ఆయన సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ సభలలో సైతం ఇదే మాట అంటూ వచ్చారు. ఇపుడు చూస్తే చంద్రబాబు నోట కూడా అదే మాట వినిపిస్తోంది.
ఏపీ అభివృద్ధి విషయమే పవన్ తానూ ఒకే మాట మీద ఉన్నామని ఏలూరులో జరిగిన ప్రజా వేదిక సభలో బాబు చెప్పారు. ఏపీ ప్రగతిని తాము ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ఇది సాధ్యపడుతుందని బాబు అన్నారు. ఏపీలో అన్ని రకాల కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతోందని దాంతో ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం ఉందని అన్నారు. పదిహేనేళ్ళు కూటమి కొనసాగితేనే అన్ని విధాలుగా విధ్వంశం అయిన ఏపీని పునర్ నిర్మించగలమని బాబు చెప్పారు. ఎన్డీయే పాలనలో ఏపీలో దశాబ్దరన్న కాలం పైగా సాగాల్సిందే అని బాబు గట్టిగా చెప్పారు.
నిజానికి దేశంలో వరసగా మూడు నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. బెంగాల్ లో మమత హ్యాట్రిక్ సీఎం గా ఉన్నారు. అలాగే బీజేపీ ఏకంగా గుజరాత్ లో ఆరు సార్లు వరసగా గెలిచి ఏడవసారి గెలిచేందుకు పోటీ పడుతోంది. అంతవరకూ ఎందుకు కేంద్రంలో ఎన్డీయే వరసగా మూడు సార్లు గెలిచింది. ఇవన్నీ బాబు పవన్ జనంలో ఉంచుతున్నారు. ఏపీ ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని అందువల్ల ఒకే ప్రభుత్వం ఒక విధానం ఒకే రకమైన ఆలోచనలతో ముందుకు సాగితే రాష్ట్రానికే భారీ లాభం కలుగుతుందని వారు చెబుతున్నారు. మరి ఇది కనుక జనాల్లోకి బాగా ఎక్కితే మాత్రం వైసీపీకి భారీ షాక్ తప్పదని అంటున్నారు. చూడాలి మరి జనాల మదిలో ఏముందో.

















