ఏపీలో చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో కూడా ఎక్కడా విసుగూ విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ విజయాలను జనంలోకి తీసుకుని వెళ్తున్నారు. అదే సమయంలో విపక్షాల వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను కూడా బాబు జనాల దృష్టికి పదే పదే తెస్తూ ఒక విధంగా వైసీపీ గ్రాఫ్ తగ్గించే పనిలో ఉన్నారు. బాబు ఏ వేదిక మీద నుంచి అయినా కూటమి ప్రభుత్వం క్రెడిట్స్ చెప్పడం, అదే విధంగా వైసీపీ మైనస్ లు చెప్పడం మీదనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.
అదే సమయంలో టీడీపీ కూటమి మంత్రులు ఏమి చేస్తున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. తమ శాఖలలో జరుగుతున్న జరగబోతున్న పనుల గురించి జనాలకు ఎప్పటికపుడు తెలియచేయాల్సి ఉందని అంటున్నారు. అదే సమయంలో భవిష్యత్తు ప్రణాళికలు చెబుతూ జనాలలో ఆశావహమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సి ఉంది. అంతే కాదు వైసీపీ అయిదేళ్ళ ఏలుబడిలో రాష్ట్రం ఎంతగా నష్టపోయింది అన్నది కూడా గణాంకాలతో సహా తెలియచేయాలని అధినాయకత్వం నుంచి అయితే కోరుకుంటున్నారు. కానీ మంత్రులు మాత్రం ఈ విధంగా దూకుడు చూపించడం లేదనే బాధ అయితే ప్రభుత్వ అధినేత చంద్రబాబులో చాలానే ఉంది.
తాజాగా శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు అని అంటున్నారు. మంత్రులు ప్రభుత్వం గురించి చెప్పాల్సినంతగా చెప్పడం లేదని బాబు అన్నట్లుగా తెలిసింది. అంతే కాదు ప్రభుత్వం నుంచి ప్రజలకు పెద్ద ఎత్తున జరుగుతున్న మేళ్ళను గురించి కూడా పెద్దగా ప్రచారం చేయడం లేదని బాబు అసంతృప్త్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. తమ మంత్రిత్వ శాఖల విషయంలో అయినా జరిగిన అభివృద్ధిని వివరించడంలో వెనకబడుతున్నారు అని బాబు అన్నట్లుగా భోగట్ట. విద్యుత్ చార్జీలు తగ్గించామని దీని వల్ల యూనిట్ కి 13 పైసలు వంతున ప్రతీ వినియోగదారుడికి భారం తగ్గుతుందని కానీ దీనికి రావాల్సినంతగా ప్రచారం అయితే రాలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు అని అంటున్నారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ విషయంలో జోరు చూపించాలని ఆయన కోరినట్లుగా అంటున్నారు.
మంత్రులు ప్రతీ రోజూ మీడియాకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని అంటున్నారు. అంతే కాదు ప్రభుత్వం చేసే మంచిని ఒకటికి పది సార్లు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేశారు అని అంటున్నారు. రాష్ట్రంలో గత పదహారు నెలలలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాగిందని ప్రతీ మంత్రిత్వ శాఖలో కూడా భారీగా ప్రగతి సాగుతోందని దానికి కూడా మంత్రులు చెప్పకపోతే ఎలా అని బాబు అన్నట్లుగా తెలిసింది. ప్రతీ మంత్రివ శాఖలో జరుగుతున్న అభివృద్ధి మీద మంత్రులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆ విధంగా వారు మీడియా ముందుకు ప్రజల ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం చేసిందేమిటో సవివరంగా చెప్పాలని చంద్రబాబు సూచించారు అని అంటున్నారు.
జీఎస్టీ 2.0 మీద దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు ఆ విషయంలో ఏపీనే నంబర్ వన్ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకున్న ఈ కార్యక్రమంలో ఏపీ ముందు ఉందని ఆయన చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కో ఆర్డినేషన్ తో పనిచేస్తున్న విషయం కూడా బాబు సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు అని అంటున్నారు. అదే విధంగా ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమం గురించి కూడా కేబినెట్ లో బాబు చర్చించారని భోగట్టా. మొత్తానికి బాబు ఏమి కోరుకుంటున్నారు అన్నది మంత్రులు ఆయన మనసెరిగి వ్యవహరించాల్సి ఉందని అంటున్నారు. పదే