ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వినూత్న ఆలోచనలతో, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, ప్రజల కోసం మాత్రమే కాకుండా, మూగజీవాల సంరక్షణ కోసం కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త ఆలోచన చేసింది. రాష్ట్రంలో పశువుల కోసం ప్రత్యేక ‘హాస్టల్స్’ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
157 నియోజకవర్గాల్లో పశువుల హాస్టల్స్, డ్వాక్రా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు గత నెల 20వ తేదీన మాచర్లలో జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని నేరుగా ప్రకటించారు. రాష్ట్రంలోని 157 నియోజకవర్గాలలో పశువుల హాస్టల్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణాలలో రోడ్లమీద తిరుగుతూ, ఇబ్బందులు పడుతున్న పశువులకు ఆశ్రయం కల్పించి, వాటికి మేతను, ఇతర సదుపాయాలను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఈ పశువుల హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణం పైన దృష్టి సారించాలని, ఈ షెడ్ల నిర్వహణ, పశుపోషణ బాధ్యతలను డ్వాక్రా మహిళలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పశువుల సంఖ్య పెంపు, పాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యం పశువుల సంఖ్యను పెంచడం, పాల ఉత్పత్తిని వృద్ధి చేయడం, పశువులకు వచ్చే వ్యాధులను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పశువుల షెడ్ల ఏర్పాటుతోపాటు, పాల ఉత్పత్తి యూనిట్లు, పాల చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, పశువుల పేడతో బయోగ్యాస్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
రోడ్ల సమస్య, కాలుష్యం నివారణకే ‘హాస్టల్స్’ రోడ్ల మీద తిరుగుతున్న పశువులు ప్లాస్టిక్ ను, కాగితాలను తింటూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని, పశువుల వల్ల ట్రాఫిక్ జామ్ లు, కాలుష్యం పెరిగిపోతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి, మూగజీవాలకు భద్రత కల్పించడానికి పశువుల హాస్టల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కర్నూలు తడకనపల్లె విజయం స్ఫూర్తి ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా తడకనపల్లె లో పశువుల హాస్టల్ ఒకటి విజయవంతంగా నడుస్తోంది. 2017 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ హాస్టల్.. పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ పశువులకు షెడ్లను నిర్మించి, నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూప్ మహిళలకు అప్పగించారు. ఈ హాస్టల్ ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ, పాల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ స్ఫూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా పశువుల హాస్టల్స్ ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సంకల్పించారు.


















