అసెంబ్లీలోనూ పార్టీ నాయకులు.. పైరవీలు చేస్తున్నారా? తమ్ముళ్లు మరింతగా బరితెగించారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వివరించారు. కొందరు ఎమ్మెల్యేలు పైరవీలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రమాదకరమని కూడా అన్నారు. దీనిని అడ్డుకుంటానని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సభలపై చంద్రబాబు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి సభలో చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావించారు.
ప్రధానంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. హద్దులు మీరుతున్నారని చెప్పారు. సొంత అజెండాలు ఏర్పాటు చేసుకుని.. సభలో మంత్రులను, ఇతర నాయకులను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ.. పరోక్షంగా వ్యాఖ్యానించినా.. అవి ఎవరిని ఉద్దేశించి చేశారో తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా సీమకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు మంత్రులను, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టాయి. ఉదాహరణకు సీమలో రెండు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని.. వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
నిజానికి అప్పటి వరకు మెడికల్ కాలేజీలు పూర్తికాలేదని.. వాటిని పీపీపీకి అప్పగిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఇలాంటి సమయంలో సదరు ఎమ్మెల్యే ప్రశ్న.. సర్కారును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అంతేకాదు.. సర్కారుపై సందేహాలు వచ్చేలా చేసింది. ఇక పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే తీరుపైనా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలకు ఒక హద్దు ఉంటుందన్నారు. మరోవైపు.. రాజమండ్రికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెప్పారన్న వాదనను కూడా చంద్రబాబు బలపరిచారు.
ఇవిలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్యేలకు.. సంతకాలు చేయించి.. వెళ్లిపోవాలన్న సూచన కూడా.. కొందరు సొంత నేతలే ఇచ్చారన్న వాదన కూడా చంద్రబాబు వినిపించారు. దీని వెనుక అక్కసు, పైరవీలు ఉన్నాయని చెప్పారు. పేరు ఎత్తకపోయినా.. చంద్రబాబు ఎవరిని అన్నారో.. సభలో ఉన్నవారికే కాదు.. సభకు రాని వారికి కూడా తెలిసింది. అదేవిధంగా ఇసుక, మద్యం, యూరియా సహా అనేక విషయాల్లో అసెంబ్లీ వేదికగా సభ్యులు లేవనెత్తిన అంశాలు కూడా సర్కారుకు ఇబ్బందిగా మారాయి. ఈ పరిణామాలే.. చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యాయి.
మరోవైపు.. పైరవీల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటానని చెప్పినా.. దీనిలో అత్యంత కీలక నాయకులే ఉండడం.. తన సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడంతో చంద్రబాబు మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఇక, మరో విషయానికి వస్తే.. విప్‌లే దారి మళ్లుతున్నారు. వాస్తవానికి ఏ ప్రభుత్వమైన విప్‌లను ఇచ్చేది సభను సజావుగా నడిపించేందుకు. కానీ, విప్‌గా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు సభలో యాగీ చేశారు. ఎలా చూసుకున్నా,.. ప్రస్తుత సభల వెనుక నేతల అసంతృప్తి.. ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. మరి దీనికి విరుగుడు ఎలా చేస్తారో చూడాలి.