రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిందని చెబుతారు. దిగ్గజ ఐటీ సంస్థలు.. ఐదు అంకెల జీతగాళ్లు ఎక్కువగా ఉన్న నగరం హైదరాబాద్. అయితే ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణ ఓ విషయంలో ఏపీ కన్నా వెనుకబడిందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. రెండు రాష్ట్రాల్లో కోటీశ్వర్లు ఎక్కువగా ఏపీలోనే ఉన్నట్లు వెల్లడైంది. అదాయపు పన్ను చెల్లింపుదారుల సమాచారం విశ్వేషిస్తూ జాతీయ మీడియా వెలువరించిన కథనాల్లో ఏపీలో దాదాపు 5,340 మంది ఏడాదికి కోటి రూపాయలు కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నట్లు వెల్లడైంది.
ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ రియల్ భూమ్ చూస్తే ఎక్కువ డబ్బు తెలంగాణలోనే సంపాదించే అవకాశాలు ఉన్నాయని అపోహ పడుతుంటారు. కానీ, వాస్తవ లెక్కల్లో ఏపీలోనే అధిక అదాయం సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయలు కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారి జాబితాలో ఆశ్చర్యకరమైన లెక్కలు బయటపడ్డాయి. దేశంలో కోటి రూపాయలు దాటి ఆదాయం సంపాదిస్తున్న వారు ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నారని చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో 1,24,800 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 20,500 మంది ఏడాదికి కోటికి పైగా సంపాదిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 24,500 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఏపీ, తెలంగాణల్లో మాత్రం ఈ లెక్కలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని అంటున్నారు.
రెండు రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతోంది. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ ఇలా ఒకటేంటి చాలా రంగాలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ లెక్కన హైదరాబాద్లోనే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉంటారని ఎవరైనా భావిస్తారు. కానీ, ఆదాయపు పన్ను రిటర్న్ పరిశీలిస్తే తెలంగాణను వెనక్కి నెట్టి ఏపీ వాసులు ఎక్కువ సంఖ్యలో కోటికి పైగా సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. ఏపీలో మొత్తం 5340 మంది కోటికి పైగా ఆర్జిస్తుండగా, తెలంగాణలో కేవలం 1,260 మంది మాత్రమే కోటి ఆదాయం వస్తున్నట్లు ప్రభుత్వానికి రిటర్స్న్ దాఖలు చేశారు.
అయితే ఈ లెక్కలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారు.. లెక్క తక్కువ చేసి చూపిస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను ఎగవేత కోసం తప్పుడు పత్రాలను దాఖలు చేస్తున్నారేమోనన్న ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. తెలంగాణ మాదిరిగా కర్ణాటకలోనూ కోటీశ్వరుల సంఖ్య తక్కువగానే ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ కంటే ఐటీలో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు కూడా అధిక ఆదాయం వచ్చే నగరంగా భావిస్తారు. కానీ, తాజాగా చూస్తే ఆ రాష్ట్రంలోనూ కేవలం 2,816 మంది మాత్రమే కోటికి పైగా ఆర్జిస్తున్నట్లు రిటర్న్స్ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ, కర్ణాటకల్లో అధిక ఆదాయం వస్తున్నా, వ్యక్తిగత ఆదాయం తక్కువగా చూపుతున్నారనే అనుమానాలను ఎక్కువ చేస్తోందని అంటున్నారు. కార్పొరేట్, హెచ్ యూఎఫ్ ఆధారిత సెటప్ ల ద్వారా సంపదను మళ్లిస్తున్నారా? అనే డౌట్ వస్తోందని అంటున్నారు.