టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం రాజమండ్రిలో పర్యటించిన లోకేష్.. స్థానిక పార్టీ కేడర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ హయాంలో పడిన ఇబ్బందులను.. అవమానాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అన్నీ నాకు బాగానే గుర్తున్నాయని తెలిపారు. బదులుకు-బదులు ఘాటుగా ఉంటుందన్నారు.
అయితే.. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసునని, కొంత సంయమనం పాటించాలని లోకేష్ సూచించారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఆదిరెడ్డి భవానీ(ఎర్రన్నాయుడి కుమార్తె)ని వైసీపీ సభ్యులు అప్పట్లో వేధించారని.. అదేవిథంగా తన తల్లి భువనేశ్వరిని కూడా సభలో దుర్భాషలాడారని.. అన్నీగుర్తున్నాయని లోకేష్ చెప్పారు. అయితే.. కొంత సమయం వేచి చూడాలన్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన వారికి అందరికీ న్యాయం జరుగుతుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేది లేదన్నారు.
“తెలుగుదేశం పార్టీని మా తాత ఎన్టీఆర్ స్థాపించారు. ఇది పేదల పక్షపాత పార్టీ. దీనిని అంతం చేయాలని, భూస్థాపితం చేయాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ, వారి ఆశలు నెరవేరలేదు. అంతేకాదు.. ఎప్పటికీ నెరవేరవు. మరో 100 ఏళ్ల పాటు టీడీపీ బలంగా ఉంటుంది. మరింతగా విస్తరిస్తుంది.“ అని నారా లోకేష్ చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు సైతం కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాజమండ్రి కార్యకర్తలు ఉప్పెనలా తరలి వచ్చారని.. ఆ సంగతులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు.
పార్టీలో అలకలు.. బుజ్జగింపులు ఉంటాయని.. అలకలు లేకుండా.. ఏ పార్టీ కూడా ఉండదని, టీడీపీ వంటి భావప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేసే పార్టీలో అలకలు ఒక జబ్బుగా మారాయని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే..ఏదున్నా కూడా.. రోడ్డున పడితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలపైనా, ఎంపీలపైనా అలగడం కంటే.. వారితో నేరుగా చర్చించి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. నాలుగు గోడల మధ్యే సమస్య-పరిష్కారం రెండూ కావాలని .. ఎవరూ మీడియా ముందుకు వచ్చి.. ఘర్షణలకు దిగడం సరికాదని నారా లోకేష్ సూచించారు.
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి. తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వంపై జగన్ సమరం చేస్తున్నారు. ఈ మొత్తం క్రెడిట్‌ను తానే తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కమ్యూనిస్టులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ కీలక సమయంలో వైసీపీతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని కూడా ప్రకటించారు.
కానీ.. జగన్ కమ్యూనిస్టులను దూరం పెట్టి.. తానే స్వయంగా ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. తద్వారా ప్రభుత్వం వెనక్కి తగ్గితే.. ఆ క్రెడిట్ మొత్తాన్నీ తన పార్టీని అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో కమ్యూనిస్టులు సహా.. ఇతర చిన్న చితకా పార్టీలతో జగన్ దోస్తీ చేయడం బెటర్ అన్న సూచనలు పార్టీలోనే చర్చ సాగుతోంది. పోయిన ప్రాభవంతిరిగి దక్కించుకునేందుకు ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
వైసీపీతో కలిసి నడిచేందుకు, ఉద్యమాలు సహా వచ్చే ఎన్నికల నాటికి కలిసి ముందుకు సాగేందుకు కూడా.. కమ్యూనిస్టులే కాకుండా.. జై భీం భారత్ పార్టీ, జైభారత్ సర్క్యులర్ పార్టీ, సహా పలు చిన్న పార్టీలు ఎదురు చూస్తున్నాయి. వీటిని కలుపుకొని ముందుకు సాగితే.. వైసీపీకి బలం చేకూరుతుందన్న చర్చ కూడా సాగుతోంది. కానీ, జగన్ మాత్రం ఆదిశగా ఆలోచన చేయడం లేదు.
దీనికి ప్రధానంగా.. తన ప్రభుత్వంపై ఆయా పార్టీలు విమర్శలు చేయడం.. తనను వ్యక్తిగతంగా దూషించడం వంటి కారణాలను ఆయన భూతద్దంలో చూస్తున్నారన్న వాదన ఉంది. కానీ… వాస్తవానికి రాజకీయాల్లో ఇలాంటివి కామనే. ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా.. రాజకీయాల్లో అందరూ అవకాశం చూసుకుని కలుస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ, తను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు ఇబ్బందులువస్తున్నాయి. మరి భవిష్యత్తులో అయినా మారుతారో లేదో చూడాలి.
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు ఈ విషయంలో ఒకింత తాత్సారం చేస్తాయి. కానీ, ఇటు టీడీపీ, అటు జనసేన, మరవైపు ప్రతిపక్షం వైసీపీ కూడా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ పుంజుకునే అవకాశాలపై ఇటీవల ఆ పార్టీ దృష్టి పెట్టింది. సోషల్ మీడియా ద్వారా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది.
మరోవైపు.. టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల మధ్యకు చేరడంలోను, ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంలోనూ ముందున్నాయి. తరచుగా ప్రజల మద్యకు వస్తున్నాయి. వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీ గ్రాఫ్ తగ్గకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. చంద్రబాబు.. పవన్‌లు ఈ విషయంలో దూకుడుగానే ఉన్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే ప్రజల మధ్యకు వచ్చేందుకు కొంత వెనుక బడి ఉందన్న చర్చ అయితే సాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్రణాళికలు రూపొందించుకుంటోంది.
మూడు విధానాలు అవలంభించాలని వైసీపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 1) గతంలో చేసిన గడప గడపకు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం. దీని ద్వారా వైసీపీ హవాను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత.. వైసీపీ నుంచి ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇప్పటికే నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజల నుంచి సానుభూతి వస్తోందని చెబుతున్న నేపథ్యంలో గడప-గడపకు కార్యక్రమం ద్వారా మరింత పుంజుకోవాలని భావిస్తున్నారు.
2) జనంతో మమేకం: ఇది వినూత్న కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో సమావేశాలు, సభలు నిర్వహించడం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకును కాపాడు కోవాలన్నది వైసీపీ వ్యూహం. స్థానిక సమస్యలు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
3) పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగడం: ఇది ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నా.. ఈ దఫా మాత్రం పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకునే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు.. సంక్రాంతి నుంచి జనసేన, టీడీపీలు కూడా ప్రజల మధ్యే ఉండనున్నాయి. మొత్తంగా మూడు పార్టీల వ్యూహాలు.. ప్రజలను ఏమేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.









