AP Irrigation White Paper విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.. రెండేళ్లలో రూ.24,611 కోట్ల కేటాయింపులు, 2028 డిసెంబర్ నాటికి రూ.35,555 కోట్లతో 36 ప్రధాన ప్రాజెక్టుల పూర్తి లక్ష్యాన్ని ప్రకటించారు.
AP Irrigation White Paper విడుదల చేస్తూ రాష్ట్ర జలవనరుల రంగంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసి, 2024లో ప్రాజెక్టుల పరిస్థితి, ప్రస్తుతం సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలు వెల్లడించారు.
జలం ఉంటేనే జీవనం, జలం ఉంటేనే వ్యవసాయం, జలం ఉంటేనే అభివృద్ధి, నాగరికత అన్న ప్రాథమిక సూత్రంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి Nimmala Ramanaidu తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడానికి గత రెండేళ్లలోనే రూ.24,611 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో ఒక్క రాయలసీమ ప్రాంత అభివృద్ధికే రూ.12,484 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, రూ.35,555 కోట్ల అంచనా వ్యయంతో 2028 డిసెంబర్ నాటికి 36 ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఇరిగేషన్ క్యాలెండర్‌ను రూపొందించి, దాని ప్రకారం ప్రతి ప్రాజెక్టుకు గడువులు నిర్ణయించి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు.
జలవనరుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక చరిత్ర ఉందని మంత్రి పేర్కొన్నారు. ఎన్టీ రామారావు కాలం నుంచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో అనేక కీలక సాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో జలవనరుల రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, సుమారు రూ.18 వేల కోట్ల అప్పులతో పాటు ఆర్థికంగా సంక్షోభ పరిస్థితిని రాష్ట్రానికి మిగిల్చిందని విమర్శించారు. ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు, 2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం నుంచి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా వెనక్కి వెళ్లిందని విమర్శించారు. పోలవరం పూర్తి తేదీలను పలుమార్లు ప్రకటించినా పనులు పూర్తి చేయలేకపోయారని, నిర్వాసితులకు కూడా సరైన నష్టపరిహారం అందలేదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం నిర్వాసితులకు మూడు విడతల్లో పరిహారం అందించామని తెలిపారు. వచ్చే ఏడాది పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే గత రెండేళ్లలో రూ.1,050 కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది ఆగస్టు 14 నుంచి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీటి సరఫరా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. రానున్న రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రకాశం జిల్లాతో పాటు కరువు, ఫ్లోరైడ్ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలకు జీవనాడిగా భావించే వెలుగొండ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో పూర్తి కాకుండానే ప్రారంభమైందని ప్రకటించడం దురదృష్టకరమని విమర్శించారు.
వెలుగొండ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.981 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ.1,108.12 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును కూడా నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.3,870 కోట్లు కేటాయించి, రెండు దశల కీలక పనులను వంద రోజుల్లో పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో సాగునీటి పరిస్థితులు పూర్తిగా మారుతాయని తెలిపారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలోని 1,026 ఎత్తిపోతల పథకాల ప్రస్తుత పరిస్థితి, డ్యాముల భద్రతా పనులు, సాగునీటి సంఘాల పునర్ నియామకం, జలధార–జలహారతి కార్యక్రమాల పురోగతిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన గణాంకాలు, వీడియో క్లిప్పింగ్‌లతో శాఖ చేపట్టిన పనులను ప్రజలకు పారదర్శకంగా వివరించామని తెలిపారు.
ఇరిగేషన్ రంగంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతూ, రాష్ట్రంలో ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సాగునీటి విస్తీర్ణం పెంపు, రైతులకు స్థిరమైన నీటి అందుబాటు, ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తి, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
AP Irrigation White Paper


















