ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక వైపు అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్తూనే మరో వైపు సంక్షేమం విషయంలో ఎక్కడా తగ్గేది లేదని చెబుతోంది. రెట్టింపు సంక్షేమం ఇస్తామని ఒట్టేసి చెప్పి మరీ అధికారం చేపట్టిన కూటమి పెద్దలు దానికి తగినట్లుగానే వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ ఒక్కసారిగా వేయి రూపాయలకు పెంచేశారు అంతే కాదు ఏప్రిల్ నుంచి కూడా ఇస్తూ పాత బకాయిలు సైతం చెల్లించారు. దాంతో సామాజిక పెన్షన్ల విషయంలో కూటమి సర్కార్ కి మంచి మార్కులే పడుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఆగస్టు నెల నుంచి కొత్తగా మరో రెండు లక్షల మందికి సామాజిక పెన్షన్లు ఇస్తోంది. వీరంతా గత ప్రభుత్వంలో అర్హత ఉండి పెన్షన్లు అందుకోని వారుగా ఉన్నారు. వారు దరఖాస్తు చేసుకుంటే దానిని పరిశీలించి వారిని కూడా పెన్షన్ కి అర్హులుగా తేల్చి ఆగస్టు నుంచి వారికి కూడా పెన్షన్ చేతిలో పెట్టనున్నారు. అంతే కాదు భర్తలు పెన్షన్ పొందుతూ చనిపోతే భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో వారికి కూడా ఆగస్టు నుంచి పెన్షన్లు అందబోతున్నాయి. అలా చూస్తే ఈ కొత్త పెన్షన్ల సంఖ్య ఏకంగా రెండు లక్షల దాకా చేరుకుందని అధికార వర్గాలు తెలియచేస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం లబ్దిదారులకు మరో అవకాశం ఇస్తోంది. అర్హులుగా ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు ఎపుడైనా చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి కొత్త పెన్షన్లు ఎప్పటికపుడు మంజూరు చేస్తామని హామీ ఇస్తోంది. అలా ప్రతీ నెలా భర్తలు చనిపోయిన వితంతువులు ఇక మీదట దరఖాస్తు చేసుకుంటే వారికి ఆ మరుసటి నెలలోనే పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ విధంగా ఆ కుటుంబానికి ఆర్ధికంగా ఆసరాగా నిలవాలని కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయమే తీసుకుంది.
గత ప్రభుత్వంలో అనర్హులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారన్నది తేలుతున్న విషయం. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ విషయంలో ఈ విధంగా జరుగుతోంది అని గమనించింది. దాంతో అనర్హుల మీద వేటు వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రస్తుతం సామాజిక పెన్షన్లు 62,81,768 మందికి ఇస్తున్నారు. ఇందులో చాలా మంది పేర్లు కనిపించడం లేదు. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు అందుబాటులోకి రాని వారు కూడా పలు సర్వేలలో తేలిన విషయంగా ఉంది. కొంతమంది చనిపోయినా పెన్షన్ అందుతోంది. అలాంటి వారి విషయంలో సర్వేలు చేసి తొలగిస్తున్నారు. ఆ విధంగా తొలగించిన వారి స్థానంలో అర్హులుగా ఉన్న వారికి పెన్షన్లు ఇస్తున్నారు. ఒక విధంగా ఈ మొత్తం సామాజిక పెన్షన్ కార్యక్రమాన్ని స్ట్రీం లైన్ చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద చూస్తే శ్రావణమాసం శుభ సమయంలో ఏకంగా రెండు లక్షల మందికి కొత్త పెన్షన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడంతో ఆయా లబ్దిదారులలో హర్షం వ్యక్తం అవుతోంది.